రాజ్ భవన్ స్కూల్‌కే దిక్కులేదు.. ఒక్క టీచర్‌తో..

గవర్నర్‌ నివాస ప్రాంగణంలోని రాజ్‌భవన్‌ ఉన్నత, ప్రాథమిక పాఠశాలకు కూడా బదిలీల దెబ్బ తప్పలేదు. రాజ్‌భవన్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మినహా మిగతా టీచర్లంతా బదిలీ అయ్యారు. ఈ పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులున్నారు.

మొన్నటి వరకు ఇక్కడ ఆరుగురు ఉపాధ్యాయులు పని చేసేవారు. ఈ బదిలీల్లో ఐదుగురు ఉపాధ్యాయులు ఇతర పాఠశాలలకు వెళ్లిపోయారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు ఒక్కరే ఉన్న పరిస్థితి. ఇక ఉన్నత పాఠశాలలో 650 మంది విద్యార్థులున్నారు. మొన్నటి వరకు 11 మంది టీచర్లు ఉండేవారు. వీరిలో ఏడుగురు ఉపాధ్యాయులు ఇతర పాఠశాలలకు బదిలీ కాగా కేవలం ఇద్దరు మాత్రమే ఇక్కడి వచ్చారు. దీంతో అక్కడి విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా తయారైంది. టీచర్లు లేక రాజ్ భవన్ స్కూల్ కి సెలవును కూడా ప్రకటించాల్సి వచ్చింది.

పాఠశాల తెలుగు మీడియం పాఠశాల. కానీ అక్కడ బోధించేది మాత్రం ఇంగ్లిషు మీడియం. బదిలీల్లో కూడా తెలుగు మీడియం పాఠశాలల జాబితాలోనే చూపించారు. అయితే ఇక్కడ చేరిన ఉపాధ్యాయులు ఇంగ్లిషులో పాఠాలు చెప్పాల్సి వస్తోంది. దీంతో తెలుగు మీడియం ఉపాధ్యాయులెవ్వరు కూడా ఈ పాఠశాలల్లో చేరేందుకు సాహసించడం లేదు. ప్రముఖులు తరుచూ వస్తుండడంతో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ కారణాలతో ఉపాధ్యాయులు ఈ పాఠశాలకు వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాజ్‌భవన్‌ ప్రాథమిక పాఠశాలలో 620 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ స్కూల్ కి చాలా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ చూసి పాలించే నాయకులు సైతం సీట్ల కోసం రికమండేషన్ చేస్తున్నారు. ఇంతమంది పిల్లల్ని మేం మెయింటైన్ చేయలేమంటూ ఏకంగా టీచర్లే ట్రాన్స్ ఫర్లు పెట్టుకున్నారని తెలుస్తోంది.

– ఉమ

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -