95% టీచర్లు ట్రాన్స్ ఫర్.. మరి విద్యార్థుల పరిస్థితి?

బంజారా హిల్స్‌లోని మంత్రుల నివాసానికి కూతవేటు దూరంలోని ఎన్‌బీటీ నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇది! ఈ స్కూలులో 500 మంది విద్యార్థులున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఇక్కడున్న ముగ్గురు ఉపాధ్యాయులు ఇతర స్కూళ్లకు వెళ్లిపోయారు. వేరే టీచర్లెవ్వరు ఇక్కడికి రాలేదు. దీంతో ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు కరువయ్యారు.

విద్యార్థులు పాఠశాలల్లో గోడల్ని చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఈ ఒక్క పాఠశాల మాత్రమే కాదు.. రాష్ట్రంలో చాలా స్కూళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ‘ఉపాధ్యాయులు కావలెను’ అంటూ మెజార్టీ ప్రభుత్వ పాఠశాలలు ముందు బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీలే ఇందుకు ప్రధాన కారణం. రాష్ట్రంలో ఈ విధంగా ఉపాధ్యాయులు లేని స్కూళ్లు వందల సంఖ్యలో ఉండడం గమనార్హం.

అంతా తరలిపోయారు.. ఉపాధ్యాయ బదిలీలతో అనేక పాఠశాలలు దిక్కులేకుండా మిగిలిపోయాయి. బదిలీల్లో ఉపాధ్యాయులంతా పరిమిత పాఠశాలలకు తరలిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఒక పాఠశాలలో బదిలీకోసం దరఖాస్తు చేసుకున్న 95శాతం ఉపాధ్యాయులూ ట్రాన్స్ ఫర్ అయిపోయారు. వీరంతా వారికి అనుకూలంగా ఉండే ప్రాంతాలకు తరలిపోయారు. ఈ స్థానాలకు వచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. వారు వెళ్లిన పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు అలా ఖాళీగా ఉండిపోయాయి. ముఖ్యంగా ఇద్దరు లేదా ముగ్గురు టీచర్లు ఉన్నటువంటి స్కూళ్లపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇందుకు ఉదాహరణే ఎన్‌బీటీ నగర్‌ పాఠశాల. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులుంటే కేవలం ముగ్గురు టీచర్లు ఉండేవారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో అనేక పాఠశాలలకు ఉపాధ్యాయులే కరువయ్యారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీలు.. విద్యార్థుల చదువులపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులు ఏం నేర్చుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంతో చాలా స్కూళ్లకు విద్యావాలంటీర్లే దిక్కుకానున్నారు. ఉపాధ్యాయ ఖాళీల్లో 16,781 విద్యావాలంటీర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 20 లోపు నియామక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.

– ఉమ