ప్రపంచానికి అరిష్టం, అనర్థం తప్పవని హెచ్చరికలు.. ఈ రాశుల వారికి ప్రతికూలం

ప్రపంచ వ్యాప్తంగా నేడు ఏర్పడబోయే సంపూర్ణ చంద్రగ్రహణం ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైనదిగా రికార్డు సృష్టించబోతోంది. భారత్‌, మెడగాస్కర్‌, ఆస్ట్రేలియాలతోపాటు దక్షిణ అమెరికా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లోనూ బ్లడ్ మూన్ కనివిందు చేయనుంది. భారత్‌లో ఈరోజు రాత్రి 11.44 నిమిషాలకు చంద్రగ్రహణం మొదలవుతుంది. అర్ధరాత్రి ఒంటి గంటకు సంపూర్ణ దశకు చేరుకుంటుంది. తెల్లవారుజామున 2.43 నిమిషాల వరకూ కొనసాగుతుంది.

ఇది చాలా ప్రమాదకరమనే ప్రచారం జరుగుతోంది. భూమి, అంగారకుడు, చంద్రుడి గురుత్వాకర్షణ బలాల ప్రభావంతో అనర్ధాలు జరుగుతాయని కొందరు సిద్ధాంతులు అంటున్నారు. కొన్ని పవిత్ర గ్రంథాల్లో ఈ బ్లడ్ మూన్ గురించి చెప్పారని.. ప్రపంచానికి అరిష్టం, అనర్థం తప్పవని హెచ్చరించారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.

సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం మేష, సింహ, వృశ్చిక, మీన రాశుల వారికి శుభంగా.. వృషభ, కర్కాటక, కన్య,ధనస్సు రాశుల వారికి మధ్యమంగా… మకరం, తుల, మిథునం, కుంభ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

మరోవైపు.. గ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తెలుగు రాష్ట్రాలు, దేశంలో ఉన్న ఇతర పుణ్యక్షేత్రాలు మూతపడనున్నాయి. గ్రహణం వీడిపోయిన తరువాత ఆలయాల తలుపులు తెరుచుకుంటాయి. హిందూ సంప్రదాయంలో గ్రహణాన్ని మైలగా భావిస్తారని, అందుకే ఆ సమయంలో ఆలయాలను మూసివేసి ఆ తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమాన్నిచేపడతారని అర్చకులు చెబుతున్నారు.

అయితే, ఈ బ్లడ్‌ మూన్‌ అరిష్టమని కొందరు అంటుంటే.. దానిని శాస్త్రవేత్తతలు కొట్టిపారేస్తున్నారు.. ఎలాంటి అపోహలు వద్దంటున్నారు.. దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి మాటలు నమ్మొద్దని శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్నారు.