పాపాయికి బంపరాఫర్: జీవితాంతం ఫుడ్ ప్రీ.. చేస్తానంటే ఉద్యోగం కూడా..

ఇలాంటి ఆఫర్లు కొద్దిమందికేనా లేక ఎవరికైనానా.. మనక్కూడా ఇలాంటి ఆఫర్ ఇస్తే బావుండు డెలివరికీ ఓ వారం రోజులు ముందే వెళ్లి రెస్టారెంట్లో కూర్చోవచ్చు అనుకుంటున్నారు కదూ.. మరీ విడ్డూరం కాకపోతే ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా జీవితాంతం ఫుడ్ ఫ్రీ అట వాళ్ల రెస్టారెంట్లో పుట్టిన పాపాయికి. అంతే కాదు చేస్తానంటే ఉద్యోగం కూడా ఇస్తామంటోంది యాజమాన్యం. మొన్నా మధ్య ట్రైన్‌లో ఓ మహిళ డెలివరీ అయి పండంటి పాపాయిని కంటే ప్యారిస్ రైల్వే శాఖ వాడికి 20 ఏళ్లు వచ్చేదాక టిక్కెట్ లేకుండా రైలెక్కేయొచ్చని ఆఫర్ ఇచ్చింది.

తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ఉంటున్న మ్యాగీ గ్రిఫిన్ నెలలు నిండిన గర్భవతి. పెయిన్స్ వస్తున్నట్లుగా అనిపించడంతో భర్త రాబర్ట్‌తో కలిసి ఆసుపత్రికి బయలుదేరింది. మార్గ మధ్యంలో తన కుమార్తెలకు ఏదైనా తినిపించాలన్న ఉద్దేశంతో చిక్-ఫిల్-ఏ రెస్టారెంట్ దగ్గర ఆగారు. వారితో పాటు మ్యాగీ కూడా దిగి రెస్టారెంట్‌లోని వాష్ రూమ్‌కు వెళ్లింది. అయితే మ్యాగీకి పెయిన్స్ ఎక్కువగా రావడంతో వాష్ రూమ్‌లో పెద్దగా కేకలు వేస్తూ పడిపోయింది. భార్య అరుపులు విన్న భర్త రాబర్ట్, రెస్టారెంట్ సిబ్బంది సహాయంతో బయటకు తీసుకు వచ్చే ప్రయత్నంలో పాపాయికి జన్మనిచ్చింది మ్యాగీ.

రెస్టారెంట్లో మాకో పాప పుట్టిందంటూ రాబర్ట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. 3 లక్షల లైకులు రావడంతో చిక్ ఫిల్ రెస్టారెంట్ కాస్తా ఫేమస్ అయిపోయింది. మేం ఆహారాన్నే కాదండోయ్.. పిల్లల్ని కూడా డెలివరీ చేస్తాం అంటూ షేర్ చేసింది రెస్టారెంట్. అంతేకాదు ఆ బుజ్జి బంగారానికి మా రెస్టారెంట్‌ని పుడుతూనే ఇంత ఫేమస్ చేశావు.. అందుకు బహుమతిగా జీవితాంతం నీకు ఫుడ్ ఫ్రీ అని ఓ బాండ్ పేపర్ మీద సైన్ చేసి మరీ ఇచ్చింది రెస్టారెంట్ యాజమాన్యం. అంతేకాదు పాపాయ్ నువ్వు చేస్తానంటే ఉద్యోగం కూడా ఇస్తామనే సరికి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.