ఆన్‌లైన్ మోసానికి బుక్కయిన డాక్టర్.. కోటిన్నర గోవింద..

కష్టపడకుండానే రూపాయి వస్తుందంటేనే ఆశ. మరి లక్షలొస్తున్నాయంటే.. ఆ ఆలోచన అసలు భూమ్మీదే నిలువనీయదు. దానికి సామాన్యులే కాదు, డాక్టర్లు, యాక్టర్లు సైతం అతీతులు కారు. ఇలాంటి వారిని ఆసరా చేసుకునే కేటుగాళ్లు ఫేక్ దుకాణాలు ఓపెన్ చేస్తుంటారు. రోజూ పొద్దున్నే పేపర్లలో, టీవీల్లో ఎన్ని వార్తలు వచ్చినా అమాయకులే కాదు అన్నీ తెలిసిన వారు కూడా అడ్డంగా బుక్కయిపోతుంటారు. రోగుల నాడి చూసి వైద్యం చేసే డాక్టర్ తనను మోసం చేసిన కేటుగాడి నాడి పట్టుకోలేకపోయాడు. హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ దినేష్‌కు వాట్సాప్ యాప్‌లో ఓ ప్రకటన కనిపించింది. తమ కంపెనీ నుంచి ఫారెన్ కంపెనీకి ట్రేడింగ్ చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించొచ్చని వివరిస్తూ ఓ ఫోన్ నెంబర్ ఇచ్చారు. దానికి డాక్టర్ టెంప్ట్ అయ్యారు.

సదరు వ్యక్తికి ఫోన్ చేస్తే అలీ అనే వ్యక్తి మాట్లాడాడు. తన మాటల మంత్రాన్ని ఉపయోగించి డాక్టర్‌ని బుట్టలో పడేశాడు అలీ. కొంత డబ్బు పెట్టుబడి పెడితే, దాని విలువ కొద్ది కాలంలోనే రెట్టింపవుతుందని డాక్టర్‌ని నమ్మించాడు. అతడి మాటలు నమ్మి మొదట రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. డాక్టర్‌ని నమ్మించడం కోసం నకిలీ వెబ్ సైట్ సృష్టించి పెట్టు బడి విలువ పెరుగుతుందని చూపించాడు. డాక్టర్‌కి ఓ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఇచ్చి అతను కూడా చూసుకునే ఏర్పాటు చేశాడు. వారంలోని పెట్టిన దానికి రూ.10 లక్షలు లాభం వచ్చింది. మొత్తం రూ.60 లక్షలు డాక్టర్ అకౌంట్‌లో పడ్డాయి.

దాంతో డాక్టర్‌కి అలీపై పూర్తి నమ్మకం కుదిరింది. మరింత పెట్టుబడి పెట్టమంటూ మెసేజ్‌లు పెట్టేవాడు అలీ. అంతర్జాతీయ మార్కెట్ భారీ లాభాల్లో ఉంది. ఆలసించిన ఆశాభగం అంటూ డాక్టర్‌ని ఊహల్లో విహరింపజేశాడు. ఇంకేముంది తన దగ్గర అంత డబ్బు లేకపోయినా బంధువుల నుంచి, స్నేహితుల వద్ద నుంచి అప్పు చేసి మరీ రూ.1.50 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు డాక్టర్‌. అంతే ఆ తరువాత ఫోన్ ఎత్తితే ఒట్టు. అలీ అడ్రస్ లేడు. అప్పుడు గానీ డాక్టర్ గారికి అసలు విషయం బోధపడలేదు. మోసపోయానని తీరిగ్గా తెలుసుకుని పరువు పోయినా పర్లేదనుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. సైబర్ క్రైమ్ నేరంగా పరిగణించిన పోలీసులు డాక్టర్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు ప్రారంభించారు. అలీ అసలు పేరు అమీర్ ఆరిఫ్ అని, సూరత్‌కు చెందిన వ్యక్తి అని తేల్చారు పోలీసులు. సూరత్‌కు వెళ్లి అతడిని అరెస్టు చేసి నగరానికి తీసుకువస్తున్నారు.