ఉగ్రవాద పార్టీలకు ఓటర్ల చెక్‌.. సంచలనం సృష్టించిన మాజీ క్రికెటర్‌

ఉగ్రవాదానికి పురిటిగడ్డ లాంటి పాకిస్థాన్‌ పగ్గాలు చేపట్టేందుకు మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ సిద్ధమయ్యారు. 22 ఏళ్ల పోరాటం తర్వాత తనకు అవకాశం దక్కిందన్న ఇమ్రాన్‌.. పేదల బాధలు తీర్చడమే లక్ష్యమన్నారు. భారత్‌తో స్నేహానికి ప్రాధాన్యం ఇస్తామంటూనే… కశ్మీర్‌ విషయంలో విషం చిమ్మారు. కశ్మీరులో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు.

ఇమ్రాన్‌ఖాన్‌.. జెంటిల్మెన్‌ గేమ్‌లో ఓ సంచలనం. క్రికెటర్‌గా అతడి పేరు తెలియని వారుండరు. 1992 వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్‌ జట్టును విజయపథంలో నడిపించిన సారథి. క్రికెటర్‌గా సంచలనాలు సృష్టించిన ఇమ్రాన్‌ఖాన్‌.. ఇప్పుడు పాక్‌ దశదిశను నిర్దేశించబోతున్నారు.

తీవ్రమైన ఆరోపణలు, వాగ్వాదాలు, భారీ హామీలతో రసవత్తరంగా సాగిన పాకిస్థాన్‌ ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌ సంచలనం సృష్టించారు. హోరాహోరీగా సాగిన ఫలితాల్లో ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ ఆధిక్య స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. 120 స్థానాలను కైవసం చేసుకుని.. మెజార్టీకి కాస్త దూరంలో నిలిచింది.

పీటీఐతో నువ్వానేనా అంటూ తలపడిన పీఎంఎల్‌-ఎన్‌ పార్టీకి 61 సీట్లు దక్కాయి. ఇక.. పీపీపీ 40 స్థానాలను, ఇతరులు 51 స్థానాలను దక్కించుకున్నారు. పాకిస్తాన్‌ పార్లమెంటులో మొత్తం 272 స్థానాలున్నాయి. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మెజార్టీ 137 సీట్లు ఉండాలి. దీంతో ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీల సాయంతో ఇమ్రాన్‌ ప్రధాని పీఠాన్ని అధిరోహరించేందుకు రెడీ అవుతున్నారు.

మరోవైపు ఇమ్రాన్‌ సారథ్యంలో.. పాకిస్థాన్‌లో పెను మార్పులు రావడం అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. ఆర్థికంగా, రాజకీయంగా ఊగిసలాడుతున్న దేశం పాక్‌. జీడీపీలో 70 శాతం అప్పులకే కట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి అస్థిర దేశంలో ఇమ్రాన్‌ తన పార్టీకి స్థిరత్వాన్ని తీసుకువచ్చారు.

క్రికెటర్‌గా విరామం తీసుకున్న తరవాత 1996లో పాకిస్థాన్ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ ను స్థాపించారు. కానీ పీటీఐకు గుర్తింపు రావడానికి 2003వరకు ఆగాల్సి వచ్చింది. అప్పటికి పార్లమెంటులో ఒకస్థానానికి మాత్రమే అది ప్రాతినిధ్యం వహించేది. తరవాత రాజకీయ శూన్యతను గుర్తించి, యువతను తనవైపు ఆకట్టుకోగలిగారు. నయా పాకిస్థాన్ అందిస్తానని తన ఎన్నికల ప్రచారంలో ప్రకటించి పాక్‌ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో ఐదు స్థానాల నుంచి పోటీచేసి విజయం సాధించారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఇమ్రాన్‌ఖాన్‌ తొలిసారి మీడియాతో మాట్లాడారు. మొదటి ప్రెస్‌మీట్‌లోనే చైనాపై ప్రశంసలు కురిపిస్తూ.. భారత్‌పై నిప్పులు కురిపించారు. ఇండియాతో సంబంధాల గురించి పాకిస్థాన్ ఐఎస్ఐ తరహాలోనే మాట్లాడారు. భారత మీడియా తనను బాలీవుడ్ విలన్‌ మాదిరిగా ప్రచారం చేసిందని విమర్శించారు. కశ్మీరు సమస్య తీవ్రమైందని ఆరోపించిన ఇమ్రాన్‌.. కశ్మీరులో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకునే వాళ్లలో తాను ఒకడినని… ఒకవేళ భారత్‌ ఒక్క అడుగు ముందుకేస్తే, పాకిస్తాన్‌ రెండు అడుగులు ముందుకేస్తుందని చెప్పుకొచ్చారు.

ఇమ్రాన్‌ఖాన్‌ క్రికెట్‌లో పాక్‌ టీమ్‌ని ఎలా నడిపించారో.. దేశాన్ని అలానే ముందుకు తీసుకెళ్తారని అతడి అభిమానులు భావిస్తున్నారు. అది ఎంతమేరకు సాధ్యమవుతుందో వేచి చూడాల్సిందే.