బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతూ నరకం చూపించిన యువకులు

పదో తరగతి బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ అమానుషం చోటు చేసుకుంది. మూడు రోజులుగా అఘాయిత్యానికి పాల్పడుతూ నరకం చూపించారా యువకులు. చింతలపూడి సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఉంటు టెన్త్‌ చదువుతున్న బాలిక.. యువకుల చెరలోకి ఎలా వెళ్లింది? సమాధానం చెప్పేందుకు వార్డన్‌ ఎందుకు మొహం చాటేస్తుంది? ఇవి సమాధానం దొరకని ప్రశ్నలుగా మారాయి.

టెన్త్‌ స్టూడెంట్‌ కనిపించడం లేదంటూ ఈనెల 23న హాస్టల్‌ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. వేర్వేరుగా ఉంటున్న ఆమె తల్లిదండ్రుల దగ్గరా లేదని తేలింది. సీరియస్‌గా విచారణ జరిపిన పోలీసులు పెదవేగి మండలం కవ్వంగుంటలో బాలికను గుర్తించారు. అదే గ్రామానికి చెందిన కిరణ్, చిట్టిబాబు అమ్మాయికి మాయమాటలు చెప్పి, అత్యాచారానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. చికిత్స కోసం బాలికను చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చింతలపూడి హాస్టల్‌ నుంచి బాధితురాలు 23 నుంచే మిస్ అయిందా.. అంతకుముందు నుంచే కనిపించడం లేదా అన్నది తేలాల్సి ఉంది. విషయం బయటకు తెలుస్తుందని భయపడే వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. చింతలపూడి పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.