ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో షాక్

central govt shak to andhrapradesh

ఏపీకి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ మరో వివాదాస్పద అఫిడవిట్ దాఖలు చేసింది. 10వ షెడ్యూల్ ఆస్తులను పంచాల్సిన అవసరం లేదని అఫిడవట్‌లో తెలిపింది. పదో షెడ్యుల్‌లోని సంస్థల సర్వీసులను మాత్రమే..మరో రాష్ట్రానికి అందజేయాలని విభజన చట్టంలో ఉందని తేల్చేసింది. ఉన్నత విద్యామండలి ఆస్తులను జనాభా ప్రాతిపదికన..పంచాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా.. అందుకు విరుద్ధంగా హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేయడం కలకం రేపుతోంది.

ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ సాధ్యం కాదని అఫిడవిట్‌లో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇటీవలే రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. అయితే రాజ్ నాథ్ సింగ్ ప్రకటనకు భిన్నంగా ఏపీకి అన్యాయం చేసేలా సుప్రీంకు కేంద్ర అఫిడవిట్ సమర్పించింది. విశాఖ జోన్‌పై రైల్వే అధికారులు చేతులెత్తేశారని తేల్చేసింది హోంశాఖ. ఇప్పటికే 16 జోన్లు ఉన్నందున కొత్త జోన్ లాభాదాయకం కాదని తెలిపిన రైల్వే శాఖ తెలిపిందని అఫిడవిట్‌లో పేర్కోంది.

విజయవాడ మెట్రో సాధ్యం కాదనే సంకేతిమిచ్చింది కేంద్రం. నూతన మెట్రో పాలసీకి అనుగుణంగా ఉంటేనే విజయవాడకు మెట్రో ఇస్తామని తెలిపింది. అమరావతి నిర్మాణం నిధులపైనా స్పష్టత ఇవ్వలేదు కేంద్ర హోంశాఖ. ఇప్పటికే రూ. 15 వేల కోట్లకు యూసీ ఇచ్చారంటూ అఫిడవిట్ ఇచ్చింది. 753 మంది ఉద్యోగుల విభజన పెండింగ్‌లో ఉందన్న హోంశాఖ .. అనేక సంస్థల ఏర్పాటు ఇంకా డీపీఆర్ తయారీ.. ఆమోదం దశలోనే ఉన్నాయని మాత్రం అంగీకరించింది.

ఇటీవలే విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చామని…ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. రెండు రాష్ట్రాల అభివృద్ధికి పన్ను రాయితీలు, మినహాయింపులపై సందర్భానుసారం చర్యలు చేపట్టినట్టు తెలిపింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా రెవెన్యూ లోటు పూడ్చామని వివరించింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్ను పంపకాలు పూర్తయ్యాయని తేల్చేసింది. పోలవరం ప్రాజెక్టులోని ఇరిగేషన్ కాంపోనెంట్‌కు 100శాతం నిధులు ఇస్తామని, నీతి అయోగ్ సిఫార్సుల మేరకు ప్రాజెక్టును వేగంగా నిర్మించే బాధ్యత రాష్ట్రానికే అప్పగించినట్లు కేంద్రం తెలిపింది.

ఏపీకి అన్యాయం జరిగేలా కేంద్ర సుప్రీంకోర్టులో వరుస అఫిడవిట్లు దాఖలు చేయడంపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. మోడీ సర్కార్ ఏపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. టిడిపి నేతలు కూడా కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.