క్షీణించిన కరుణానిధి ఆరోగ్యం.. హెల్త్ బులెటన్ విడుదల

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి ఆరోగ్యం క్షీణించడంతో.. ఆయన్ని అర్థరాత్రి కావేరి ఆస్పత్రికి తరలించారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూలో వెంటిలేటర్ల సాయంతో చికిత్స అందిస్తున్నారు. కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందని తెలియడంతో కుటుంబసభ్యులు, స్టాలిన్, అళగిరి.. గోపాలపురంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కరుణానిధిని వెంటనే, కావేరి ఆస్పత్రికి తరలించారు.

కరుణానిధి ఆరోగ్యం పరిస్థితిపై కావేరి ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటన్ విడుదల చేశారు. కరుణానిధికి బీపీ పల్స్ రేట్ డౌన్ అవ్వడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యుల సమక్షంలో చికిత్స అందుతోందని చెప్పారు. బీపీ పడిపోవడం వల్లే కరుణానిధిని ఆస్పత్రికి తరలించామని ఎ.రాజా తెలిపారు. చికిత్స అనంతరం ఆరోగ్యం నిలకడగా ఉందని.. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని చెప్పారు.

కరుణానిధి ఆరోగ్యం మెరుగుపడుతోందని, జ్వరం తగ్గిందని డీఎంకే నేతలు స్టాలిన్‌, దురైమురుగన్‌, అళగిరి శుక్రవారం రాత్రి ప్రకటించారు. వదంతులు నమ్మవద్దని పార్టీశ్రేణులకు భరోసానిస్తూ వచ్చారు. స్టాలిన్‌ తో పాటు ఇతర నేతలంతా రాత్రి పదిగంటల తర్వాత కరుణనిధి ఇంటి నుంచి వెళ్లిపోయారు. అనంతరం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట 15నిమిషాల ప్రాంతంలో స్టాలిన్‌, అళగిరి, ఎ.రాజా, కనిమొళి, దురైమురుగన్‌ మరోసారి గోపాలపురంలోని కరుణ నివాసానికి చేరుకున్నారు. వారితో పాటు కావేరి ఆసుపత్రి వైద్యుల బృందం అంబులెన్స్‌తో సహా వచ్చారు. కరుణానిధిని అంబులెన్స్‌లో ఆసుపత్రిలో చేర్చారు.

కలైంజర్ ఆరోగ్యం విషమించిందంటూ వార్తలు రావడంతో పెద్ద ఎత్తున డీఎంకే కార్యకర్తలు కావేరి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో.. కొన్ని గంటలపాటు అభిమానులు ఆందోళన చెందారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -