కావలి ఎమ్మెల్యే అరెస్ట్‌.. వైసీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో.. నెల్లూరులోని వైసీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తన నియోజకవర్గంలోని ఆలూరు మండలంలో పర్యటించేందుకు ఆయన సిద్ధమవగా పోలీసులు వారించారు. అక్కడి మత్స్యకార గ్రామాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అయినా.. ప్రతాప్‌ కుమార్ రెడ్డి విన్లేదు. సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారాయన. టూర్‌కు సిద్ధమవడంతో పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని ఇస్కపల్లిలో పర్యటనకు ఈ వారంలోనే ఓసారి ప్లాన్ చేసుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి. అయితే.. అక్కడి ప్రజలు మాత్రం ఎమ్మెల్యే తమ గ్రామానికి రావడాన్ని వ్యతిరేకించారు. మత్స్యకారుల పెద్ద ఓ ఆర్డర్‌ కూడా జారీ చేశారు. దీంతో.. అక్కడి పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మొన్న ఎమ్మెల్యేను హౌస్‌ అరెస్ట్ చేశారు. ఇస్కపల్లికి వెళ్లొద్దని సూచించారు. ఇవాళ వెళ్లేందుకు సిద్ధమవగా నెల్లూరులో అదుపులోకి తీసుకున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -