డేంజర్‌లో సుంకేసుల డ్యాం.. గేట్లు ఎత్తుతుండగా తెగిపోయిన రోప్ వైర్లు

సుంకేసుల డ్యాం డేంజర్‌లో పడింది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదఘంటికలు మోగిస్తోంది. డ్యాంకు మొత్తం 30 గేట్లు ఉండగా.. సగానికి పైగా రిపేర్లలో ఉన్నాయి. ఇటీవల ఎగువ నుంచి సుంకేసులకు భారీగా వరద రాగా అధికారులు గేట్లు ఎత్తేందుకు యత్నించారు. అయితే సగం గేట్లు మొరాయించాయి. గేట్లు ఎత్తుతుండగానే రోప్ వైర్లు తెగి కొన్ని కుప్పకూలాయి. దీంతో అధికారులకు చుక్కలు కనిపించాయి. మిగితా గేట్లతో పాటు స్లూయిజుల ద్వారా నీటిని దిగువకు వదిలి చివరికి ఊపిరిపీల్చుకున్నారు.

డ్యాంలో గరిష్టమట్టంలో నీరు ఉండటంతోఆక్సిజన్ పెట్టుకుని అతికష్టం మీద 9 గేట్లకి కొత్త రోప్‌ వేలు ఫిట్ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం డ్యాం నుంచి 8 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్రకు భారీగా వరద వస్తుందని తెలిసినా అధికారులు అప్రమత్తం కాకపోవడం దుమారం రేపుతోంది. గేట్ల ఎత్తడంలో ఆలస్యమైతే పరిస్థితి దారుణంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2009లో పోటెత్తిన వరదకు సుంకేసుల డ్యామ్ దెబ్బతింది. అయినా ప్రభుత్వం శాశ్వాత మరమత్తులు చేపట్టలేదు. 80 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకున్నారు డ్యాం అధికారులు. కొన్ని రోజుల నుంచి నీరు చెట్టు కింద 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నా.. ఎగువనుంచి వరద వచ్చే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు సుంకేసుల అధికారులు.

తుంగభద్ర నుంచి వరద తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో సుంకేసుల డ్యాం భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి త్వరగా గేట్లకు రిపేర్లు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.