ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు.. ఉరేసుకుని చనిపోయిన..

ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించారు. విషయం తెలిసి ఇద్దరూ కొట్టుకున్నారు. నాకే దక్కాలి అంటూ ఫైటింగ్‌లు చేశారు. మధ్యలో నువ్వెవరు అంటూ చంపేస్తా అన్న బెదిరింపుల వరకూ విషయం వెళ్లింది. సీన్ కట్ చేస్తే… ప్రేమించిన ఇద్దరు యువకుల్లో ఒకరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన ఈ ట్రయాంగిల్ లవ్‌ స్టోరీ విషాదాంతమైంది.

కదిరిలోని రాజేంద్రప్రసాద్ వీధిలో ఉండే మణికంఠ నాయక్, కొండకమర్లకు చెందిన తన బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం కూటగుళ్లకు చెందిన మరో అబ్బాయిని ప్రేమిస్తోంది. ఈ లవ్ యాంగిల్ మణికంఠకు తెలిసింది. దీంతో ఈ ట్రయాంగిల్ ప్రేమ వ్యవహారంపై నాలుగు రోజుల క్రితం ఇద్దరు యువకులు గొడవ పడ్డారు. అమ్మాయి జోలికొస్తే ఖబర్దార్ అంటూ వార్నింగ్‌లు ఇచ్చుకున్నారు.

ఈ ట్రయాంగిల్ ప్రేమ వ్యవహారం, ఇద్దరు కొట్టుకున్న విషయం మణికంఠ కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈ గొడవలంతా ఎందుకనుకుని, వారు చిత్తూరు జిల్లాకు చెందిన వేరే అమ్మాయితో మణికంఠకు వివాహం చేయించారు. అంతలోనే కదిరిలో మణికంఠ నాయక్ ఉరేసుకుని చనిపోయాడు. కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యే అంటున్నారు. అమ్మాయి బంధువులు గానీ, ఆమె లవర్ అయినా చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తను ప్రేమించిన అమ్మాయి వేరే యువకుడిని ప్రేమించిందనో, లేక.. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారన్న కారణంతో చనిపోయాడా అన్నది తేలాల్సి ఉంది.