వణికిపోతున్న రాజధాని.. నగరాన్ని ముంచెత్తుతున్న వరద

దేశ రాజధాని ఢిల్లీ వరదల ధాటికి వణికిపోతోంది.. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా ఢిల్లీలో నీటి మట్టం 205 మీటర్లు దాటింది. పాత ఢిల్లీ రైల్వే బ్రిడ్జి దగ్గర 205.44 మీటర్లుగా నమోదైంది. హర్యానాలోని హిరాకుడ్‌ డ్యాం నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో ప్రవాహం మరింత పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ముమ్మరంగా సహయక చర్యలు చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో వేల మందిని పునరావాస ప్రాంతాలకు తరలించారు.

వరదల నేపథ్యంలో అధికారులతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అత్యవసర సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నది ప్రవాహం మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మరిన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. దాదాపు పదివేల మంది ప్రజలపై యమున ప్రభావం పడే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. విపత్తు నిర్వహణ సంస్థ కూడా అప్రమత్తంగానే ఉంది.. ఏ క్షణమైనా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉంది.