ఆ ఓట్లు చీలకుండా ఉండేందుకు జగన్‌కు ఉన్న ఒకే ఒక ఫార్ములా ఇదే!

నిన్నటి వ‌ర‌కు అవిశ్వాస తీర్మానం, పార్లమెంట్ అంటూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన ఏపీ రాజ‌కీయాలు ఒక్క సారిగా సొంత‌ రాష్ట్రంలోనే ల్యాండ్‌ అయ్యాయి… సీఎం చంద్రబాబుకు కాస్త విశ్రాంతి ఇచ్చిన ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్, జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై అవాకులు, చ‌వాకులు పేల్చారు. ఇన్నాళ్లూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరును కూడా ప్రస్థావించ‌ని జ‌గ‌న్ ఏకంగా వ్యక్తిగ‌త ఆరోప‌ణ‌ల‌ను చేయడంపై నెగిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది…

ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉండేందుకు జగన్ ముందు ఒకే ఒక ఫార్ములా ఉంది.. అది పవన్‌ను కలుపుకుపోవడం. అయితే ఇప్పటి వరకు జగన్ కానీ..పవన్ కానీ ఒక వేదికను పంచుకున్న దాఖలాలు లేవు. అటు పవన్ కానీ.. ఇటు జగన్ కానీ కలిసి ప్రజా సమస్యలపై పోరాడాలన్న ఆసక్తి ఇప్పటి వరకు కనబరచలేదు.. అయితే ఇక్కడ జగన్‌కే పవన్ అవసరం ఎక్కువగా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే పవన్ మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పటి వరకు పొలిటికల్‌ అనలిస్టులు వేసిన అంచనా… కానీ సడెన్‌గా జగన్‌ పవన్‌పై విరుచుకుపడటం… వ్యక్తిగత ఆరోపణలకు దిగడంతో ఆ అంచనాలకు తెరపడింది.

గత ఎన్నికల్లో పవన్ మద్ధతు కారణంగానే టీడీపీ గెలిచిందని.. పవన్ సామాజికవర్గం మొత్తం గుంపగుత్తగా ఓట్లన్ని తెలుగుదేశానికే వేసిందని వైసీపీ అధినేతకు తెలుసు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని గట్టి నిర్ణయానికి వచ్చిన జగన్ కాపు నాయకులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. ఆ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో కాపులకు దగ్గరవుతూ వచ్చారు. అంతా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న తరుణంలో జగన్ కోరి పెద్ద తప్పు చేశాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రాజకీయంగా ఎవరినైనా ఎదుర్కోవాలని… వ్యక్తిగత దూషణలు పాలిటిక్స్‌లో పనికిరావన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌… జగన్‌ చేసింది ముమ్మాటికీ తప్పేనని స్పష్టం చేశారాయన.

జ‌వాబుదారిత‌నం కోస‌మే రాజ‌కీయాల్లోకి వచ్చానని.. జ‌గ‌న్ లా దోచుకోవ‌డానికి కాద‌న్నారు ప‌వ‌న్.. స‌మాజంలో మార్పు తీసుకొస్తున్నాన‌నే భ‌యంతోనే తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ అంద‌రూ తనను తిడుతున్నారని, తాను ఒంటిస్తంభం మేడలో కూర్చొనే వ్యక్తి కాదని… నేల మీద న‌డిచే వ్యక్తి అని గుర్తించుకోవాలన్నారు. క‌నుమ‌రుగైన మాన‌వ‌త్వాన్ని, జ‌వాబుదారిత‌నాన్ని రాజ‌కీయాల్లో తీసుకురావడానికే జ‌న‌సేన పార్టీ పెట్టాన‌ని తెలిపారు. రాజ‌కీయాల‌కు వేల‌కోట్లు, గూండాలు అవసరం లేదన్నారు.