అమ్మానాన్న పెళ్లికి ఒప్పుకోలేదని ఆత్మహత్య.. కట్ చేస్తే..

ప్రేమకు ఎవరి ప్రమేయం అవసరం లేదు. రెండు మనసులు కలిస్తే చాలు. మరి పెళ్లి చేసుకోవాలంటే రెండు కుటుంబాలు అంగీకరించాలి. వారి ప్రేమను కాదని పెళ్లికి ఒప్పుకునేది లేదన్నారు పెద్దలు. దాంతో ఆ ప్రేమ జంట చావే శరణ్యం అంటూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. అదృష్టం బావుండి ప్రాణాలతో బయటపడింది ఓ ప్రేమజంట. రెండేళ్లుగా అమ్మానాన్నకు తెలియకుండా ప్రేమించుకుంటున్నారు హరియాణాకు చెందిన గురుముఖ్ సింగ్, కుసుమలు.

గురుముఖ్ దాబా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుసుమ కాలేజీలో చదువుకుంటోంది. కాలేజీ నుంచి వచ్చేటప్పుడు తరచుగా స్నేహితులంతా దాబాకి వెళుతుండేవారు. ఈ క్రమంలోనే గురుముఖ్, కుసుమల చూపులతో పాటు మాటలూ కలిసాయి. మొబైల్‌ ద్వారా మనసులోని మాటల్నీ, భావాల్ని షేర్ చేసుకునేవారు ఒకరికి ఒకరు. అలా రెండు సంవత్సరాలు వారి ప్రేమాయణం సాగింది. ఇక ప్రేమను చాలించి పెళ్లి చేసుకుందామనుకున్నారు వీరిద్దరూ.

అదే విషయాన్ని ఇరు కుటుంబాల వద్ద ప్రస్తావించారు. వారు ససేమిరా ఒప్పుకోలేదు. ప్రేమా లేదు పెళ్లి లేదు పొమ్మన్నారు. దీంతో మనస్థాపం చెందిన గురుముఖ్, కుసుమలు ఆత్మహత్యకు ప్రయత్నించారు. పురుగుల మందు తాగేసారు. అపస్మారక స్థితిలో పడివున్న వీరిని గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు కబురు చేసారు. వైద్యుల ప్రయత్నం ఫలించి ప్రేమజంట ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వారిని చూసిన కుటుంబసభ్యులు భోరుమన్నారు. ఇరు కుటుంబాలు మాట్లాడుకుని ఆసుపత్రిలోనే వారి పెళ్లి చేసారు.