డీఎంకే అధినేత కోలుకోవాలంటూ.. ఇళయరాజా పాట

కొందరు నాయకులు మాత్రమే ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి అరుదైన నాయకుల్లో కరుణానిధి కూడా ఒకరు. వయసు మీద పడి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉన్న కరుణ త్వరగా కోలుకోవాలని అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆసుపత్రిలో జాయిన్ అయినతరువాతనే పొత్తి కడుపు కాన్సర్‌తో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు.

ఈ క్రమంలోనే పలువురు నేతలు ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శిస్తున్నారు. కుటుంబ సభ్యులనడిగి ఆరోగ్య వివరాలను కనుక్కుంటున్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజాకు, కరుణానిధితో సాన్నిహిత్యం ఎక్కువగా ఉంది. తానెంతగానో అభిమానించే ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఇళయరాజా ప్రత్యేకంగా పాట పాడారు. ‘లేచిరా మమ్ముల్ని చూసేందుకు’ అంటూ పాడిన పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కావేరీ ఆసుపత్రి పరిసర ప్రాంతాలన్నీ కోలాహలంగా మారాయి. రాజకీయ నాయకుల రాకపోకలతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. తమిళనాడు సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, మత్య్సశాక మంత్రి జయకుమార్ కావేరి, పలువురు బీజేపీ నేతలు సినీ నటుడు సత్యరాజ్ తదితరులు కరుణానిధిని పరామర్శించిన వారిలో ఉన్నారు.