శిథిల భవనాల్లో ప్రభుత్వ పాఠశాలలు.. నల్గొండ దుస్థితి

సర్కారీ బడుల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. టీచర్లుంటే విద్యార్థులు ఉండరు, విద్యార్థులు ఉంటే టీచర్లు ఉండరు. అందరూ ఉన్న చోట మౌలిక వసతులు ఉండవు. శిథిల భవనాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చదువులు కొనసాగిస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో విద్యార్థులు. ఇది ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యధే కాదు. అన్ని జిల్లాలదీ ఇదే పరిస్థితి.

ప్రభుత్వ బడుల్లో చదువులు ముందుకు సాగేలా కనిపించడం లేదు. మళ్లీ మళ్లీ అవే సమస్యలు వెక్కిరిస్తున్నాయి. మౌలికవసతుల లోటు ఎప్పటికీ సమస్యగానే మారుతోంది. ఒక్కో స్కూల్ లో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నా.. అదనపు గదుల మాట ఎత్తరు. ఒకవేళ అడిషనల్ క్లాస్ రూమ్ లకు పర్మిషన్ వచ్చినా.. ముక్కుతూ.. మూలుగుతూ.. ఏళ్లకు ఏళ్లు నిర్మాణాలు కొనసాగదీసే పరిస్థితి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 5లక్షల 48వేల 567 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం.. దాదాపు 240కిపైగా పాఠశాలల్లో గదులు శిథిలమయ్యాయి. మరో 21 పాఠశాలలకు అత్యవసరంగా భవనాలు కావాలి. ఇప్పటికే 30 పాఠశాలలకు అదనపు గదుల నిమిత్తం నిధులు మంజూరైన భవనాలు ప్రారంభం కాలేదు. మారుమూల ప్రాంతాలైన చందంపేట, దేవరకొండ, పెద్దవూర, మునుగోడు, చండూరు, ఆలేరు, రాజాపేట, నాంపల్లి, తుంగతుర్తి, పెన్‌పహడ్‌, తిరుమలగిరి మండలాల్లోని బడులు మరీ ఘోరంగా తయారయ్యాయి. ఈ ప్రాంతాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ తక్కువగా ఉండటంతో.. ఇక్కడి సర్కారీ బడులు ఏటేటా శిథిలమవుతున్నాయి.

నిజానికి.. నెల నెలా ఉపాధ్యాయుల వేతనాలకు 60 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. ఏటా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు 6కోట్ల 50లక్షల రూపాయలు ఖర్చు కానుంది. సర్కారు బడుల్లో మౌలిక వసతుల కోసం ఏటా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం మాత్రం కేవలం పదుల కోట్లలోనే ఖర్చు చేస్తోంది. హుజూర్ నగర్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 568 మంది విద్యార్థినులున్నారు. వీరందరికి ఉన్న ఉన్న టాయిలెట్ల సంఖ్య కేవలం రెండే. వీటినే విద్యార్థినులు వాడుకోవలసిన దౌర్భాగ్యం.

సూర్యపేట జిల్లా నాగారంలో ఉన్న బీసీ బాలుర గురుకులంలోనూ ఇదే పరిస్థితి. దాదాపు నాలుగొందలకు పైగా స్టూడెంట్స్ ఉంటున్నా.. కనీస వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బాత్రూమ్స్, టాయిలెట్స్ లేక పిల్లలు అందరూ బహిరంగ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. మౌలిక వసతులు కల్పించాలని, తాజాగా స్టూడెంట్స్, పేరెంట్స్ అంతా రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.

రామన్నపేట మండలం, సిరిపురం గ్రామంలో.. ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి కూలిపోయింది. ఆ సమయంలో పిల్లలు లేకపోవడంతో.. పెనుప్రమాదం తప్పింది. నార్కెట్ పల్లి బాలికల పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు లేక విద్యార్థినులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు.

నల్లగొండ నడిఒడ్డునున్న బొట్టుగూడా బాలకల పాఠశాలలో టాయిలెట్ల సమస్య వేధిస్తోంది. వందల మంది బాలకలు ఉన్నప్పటికీ.. కేవలం ఒకే ఒక్క టాయిలెట్ తో విద్యార్థినులు ఇబ్బందులు తప్పడం లేదు. పెద్దవూర మండలం, పర్వేదు ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరింది. స్కూల్ బల్డింగ్ లు పాతవి కావడం.. బడి చుట్టూరా ప్రహారీ గోడ లేకపోవడంతో.. పాములు, తేళ్లు వస్తున్నాయంటూ స్టూడెంట్స్, వారి పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిడమనూర్ మండలంలోని సోమవారిగూడెంలోనూ ఇదే పరిస్థితి ఉంది.

ప్రైవేటు పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అని సర్కారు చేపట్టిన బడిబాట కార్యక్రమానికి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు న్యాయం చేయాలి. అప్పుడే సర్కారీ బడులు బాగుపడుతాయి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -