సమస్యలకు నిలయాలు నెల్లూరులోని సర్కార్‌ బడులు

చదువుల జిల్లాగా పేరొందిన నెల్లూరులో సర్కార్‌ బడులు సమస్యలకు నిలయంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు పేరెంట్స్‌ ఆసక్తి చూపిస్తున్నా.. సదుపాయల కొరత అడ్డంకిగా మారుతోంది. అందుకే ఏడాదికేడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న పర్సంటేజ్‌ తగ్గుతూ వస్తోంది.

ఈ పాఠశాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బాల్యానికి తీపిగుర్తు. ఇంత ప్రత్యేకత ఉన్న ఈ పాఠశాలలో ఇప్పుడు కనీస వసతులు లేవు.

వెంకటాచలం మండల కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కసుమూరు ఉన్నత పాఠశాలే సమీప గ్రామాలకు పెద్ద దిక్కు. దాదాపు పదికి పైగా గ్రామాల విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. కానీ అందుకు సరిపడా సౌకర్యాలు మాత్రం లేవు.

ఐదు సెక్షన్లు తెలుగు మీడియం మరో ఐదు సెక్షన్లు ఇంగ్లీష్ మీడియం.. మొత్తం ఐదు నుంచి 10వ తరగతి వరకు క్లాస్‌లు ఉన్నాయి. అయితే హైస్కూల్‌లో ఉన్నవి 9 గదులే.. అందులో ఒకటి హెడ్మాష్టర్ కార్యాలయం, మరో రెండు గదులు డిజిటల్ క్లాస్ రూములు, వర్చువల్ క్లాస్ రూమ్, స్టాఫ్‌ రూమ్స్‌.. ఇక మిగిలిన ఐదు గదుల్లో 400 మందికిపైగా విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి.

ఎందరో ప్రముఖులకు పాఠాలు నేర్పిన ఈ హైస్కూళ్లో.. ప్రస్తుత విద్యార్థుల అవస్థలు వర్ణాతీతం.. కనీసం ఐదు తరగతులు చెట్ల కిందే నిర్వహించాల్సిన పరిస్థితి. ఇక మరుగుదొడ్లు, తాగునీరు పరిస్థితి అత్యంత ఘోరం. ప్రత్యేకించి బాలికలు బాత్‌ రూమ్‌కు వెళ్లాలంటే అరకిలో మీటర్ దూరంలో ఉన్న ముళ్లపొదల వైపు నడవాల్సిన పరిస్థితి.

పాఠశాలకు కనీస వసతులు కల్పించాలి అంటూ ఉపాధ్యాయులు, విద్యార్దులు, విద్యా కమిటీ చైర్మన్, విద్యార్దుల తల్లిదండ్రులు జిల్లా అధికారులను పదే పదే కోరినా.. ఇప్పటికీ స్పందన రాలేదు. అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, సరిపడ తరగతి గదులు ఉన్నాయంటూ వివరణ ఇస్తున్నారు.

ఇటీవలే నెల్లూరు జిల్లా నూటికి నూరు శాతం ఓడిఎఫ్‌గా డిక్లేర్‌ అయ్యిందని.. అధికారుల నుంచి అమాత్యుల వరకు అంతా అవార్డులు తీసుకున్నారు. కానీ వాస్తవానికి ప్రభుత్వ పాఠశాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.