ఆధార్‌ గోప్యతపై సవాల్‌ విసిరి.. అడ్డంగా బుక్కయిన ట్రాయ్ చైర్మన్‌

ఆధార్‌ గోప్యతపై సవాల్‌ విసిరిన ట్రాయ్ చైర్మన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన వ్యక్తిగత వివరాలు బయటపెట్టాలన్న ఆర్‌ఎస్‌ శర్మకు… ఫ్రెంచ్‌ సైబర్‌ నిపుణుడు షాకిచ్చాడు. శర్మ డేటా గుట్టు రట్టు చేసి… ఆధార్‌ భద్రతపై దేశ ప్రజల్లో మరిన్ని సందేహాలు పెంచాడు.

ఆధార్‌ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. ట్రాయ్‌ ఛైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆధార్‌ డేటాను ఎవరూ హ్యాక్‌ చేయలేరంటూ సవాల్‌ విసిరి… అడ్డంగా బుక్కయ్యారు. దీంతో ఆధార్‌ భద్రతపై దేశ ప్రజల్లో మరిన్ని సందేహాలు ఏర్పడ్డాయి.

ఆధార్‌ డేటాను హ్యాక్‌ చేయలేరంటూ గట్టి నమ్మకంతో ఉన్న ఆర్‌ఎస్‌ శర్మ… ఒపెన్ ఛాలెంజ్ చేశారు. ఎవరైనా తన డేటాను లీక్‌ చేయాలంటూ… ట్విట్టర్‌లో ఆధార్‌ నంబర్‌ను పోస్ట్‌ చేశారు. దీంతో ఫ్రెంచ్‌ సైబర్‌ నిపుణుడు ఎల్లైట్‌ అల్డర్సన్‌… శర్మ ఆధార్‌ నంబర్‌ను ఉపయోగించి.. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టాడు. ‌

శర్మ ఫోన్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీ,‌ పాన్‌ సమాచారంతో పాటు ఆయన ఓ మహిళతో దిగిన ఫొటోను కూడా పోస్ట్‌ చేశాడు. శర్మ ఆధార్‌ నంబర్‌.. బ్యాంక్‌ అకౌంట్‌తో అనుసంధానం కాలేదన్న విషయాన్ని కూడా బయటపెట్టాడు. దీంతో ఛాలెంజ్‌లో ఓడిపోయిన శర్మ… ఈ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు. అయితే ట్రాయ్‌ ఛైర్మన్‌ పనులపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలే ఆధార్‌ భద్రతపై జనాల్లో ఆందోళన నెలకొన్న సమయంలో… మరిన్ని సందేహాలకు తావిచ్చారంటూ ఫైరవుతున్నారు.

మరోవైపు ఆధార్‌ నంబర్‌ ద్వారా ట్రాయ్ ఛైర్మన్‌ పర్సనల్‌ డేటా బయటపడ్డట్టు వచ్చిన వార్తలను యూఐడీఏఐ తోసిపుచ్చింది. ఫ్రెంచ్‌ సైబర్‌ నిపుణుడు బయటపెట్టిన వివరాలు… ఆధార్ డేటాబేస్ నుంచి హ్యాక్‌ చేసినవి కావని స్పష్టం చేసింది. శర్మ పబ్లిక్ సర్వెంట్ అయినందువల్ల… ఆయన సమాచారం ఇప్పటికే గూగుల్ సహా ఇతర వెబ్‌సైట్లలో అందరికీ అందుబాటులో ఉందని తెలిపింది.