యూనివర్సిటీ ప్రాంగణంలో ముద్దూ ముచ్చట్లు..

ముసిరిన మబ్బులు.. చిరు జల్లులు.. మదిని కలవరపెడుతున్న కోర్కెలు.. మనసైన వాడు పక్కనే ఉంటే, చుట్టూ ఎంత మంది ఉన్నా మాకనవసరం అన్నట్లే ఉంటారు ప్రేయసీ ప్రియులు. ఢాకా యూనివర్సిటీ ప్రాంగణంలో ఓ ప్రేమజంట తామెక్కడ ఉన్నదీ మరచి ప్రేమకు హద్దులు లేవంటూ ముద్దుల్లో మునిగిపోయారు. ఈ ఫ్రీ షోని ఓ ప్రింట్ మీడియా ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించాడు. తను పనిచేసే ఆఫీస్‌లో పబ్లిష్ చేయమంటూ ఫోటో ఇస్తే ఎడిటర్ ఒప్పుకోలేదు. దాంతో ఫొటోగ్రాఫర్ ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాసేపట్లోనే అది వైరల్‌గా మారింది.

ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే బంగ్లాదేశ్‌లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఇంతకు ముందు ఓసారి కూడా యూనివర్సిటీలో రూల్స్ అతిక్రమించి ఇద్దరు విద్యార్థులు చేతిలో చేయి వేసుకుని కనిపించారని వారిని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. అసలే గత కొంత కాలంగా యూనివర్సిటీ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. తాజాగా జరిగిన ఈ ఉదంతం విద్యార్థుల్లో భయాందోళనలను రేకెత్తిస్తోంది.

ఫొటోగ్రాఫర్ అహ్మద్ ప్రేమజంట ఫొటోని తీయడానికి ధైర్యం చేసినా ఎడిటర్ ప్రచురించడానికి ధైర్యం చేయలేకపోయాడు. అయితే అహ్మద్ ఆ ఫోటోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ విషయం ఎక్కడ గొడవలకు దారితీస్తుందో అని ముందు జాగ్రత్త చర్యగా అహ్మద్ నుంచి ఐడీ కార్డ్, లాప్ టాప్ తీసుకుంది పత్రికా యాజమాన్యం. అహ్మద్‌ కూడా ఆ మర్నాటి నుంచి ఆఫీస్‌కి వెళ్లడం మానేశాడు. దేశంలో చదువుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నా తమ భావాలను వ్యక్తీకరించే పరిణతి ఇంకా చోటు చేసుకోలేదని అహ్మద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ దిశగా మార్పు రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందంటున్నాడు.