బోనాలతో వెలిగిపోయిన ఉజ్జయినీ మహాంకాళి

లష్కర్ మురిసింది. ఉజ్జయినీ మహాంకాళి బోనాలతో వెలిగిపోయింది. వేలాదిగా తరలివచ్చిన జనాలతో సికింద్రాబాద్ జనసంద్రమైంది. అమ్మ దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. మహిళలు బోనాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తొలి బోనం .. ప్రభుత్వం తరపున ఎంపీ కవిత బంగారు బోనం సమర్పించారు. సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా అమ్మకు పూజలు చేశారు. ఇవాళ జరిగే రంగంతో బోనాల సంబరం ముగియనుంది.

లష్కర్‌ బోనాల ఉత్సవాల సంబరాలు అంబరాన్నితాకుతున్నాయి. మొదటి రోజు భక్తులు తెల్లవారు జామునుంచే అమ్మవారికి మొక్కులు సమర్పించేందుకు బోనాలతో తరిలివచ్చారు. క్యూలైన్లలో భక్తులు బారులు తీరడంతో సికింద్రాబాద్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబం తొలి బోనం సమర్పించింది. వజ్రపు ఖడ్గం, బంగారు బొట్టు, ముక్కుపుడకను కానుకగా సమర్పించారు.

అమ్మవారి ఆలయ గర్భగుడిని ఈసారి వెండి తాపడంతో సుందరీకరించారు. తొలిసారిగా కోటి రూపాయల వ్యయంతో బంగారు బోనం తయారుచేశారు. మూడు కిలోల 800 గ్రాములతో రూపొందించిన బంగారు బోనాన్ని ఉజ్జయిని మహంకాళి, మాణిక్యాలమ్మ ప్రతిమలతోపాటు 285 వజ్రాలతో అలంకరించారు. ఆదయ్యనగర్‌ నుంచి వెయ్యి 8 బోనాలతో ఎంపీ కవిత ర్యాలీగా వచ్చి.. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని అమ్మవారికి మొక్కుకున్నట్లు తెలిపారు.

టిపిపిసి చీఫ్ ఉత్తమ్ సహా అన్ని పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు ప్రతీకలుగా నిలుస్తాయని మంత్రులు చెప్పారు.

బోనాల సంబరాల్లో గ్రామీణ, జానపద, శాస్త్రీయ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయానికి సమీపంలో ఏడు సాంస్కృతిక వేదికలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మోండా మార్కెట్ వద్ద త్రీడీ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. భక్తులతో కలిసి స్టెప్పులు వేసి సందడి చేశారు మంత్రి తలసాని.

సోమవారం జరిగే రంగo కార్యక్రమంలో స్వర్ణలత అనే మహిళ భవిష్యవాణీ చెబుతుంది. అనంతరం అమ్మవారిని అంబారిపై ఊరేగిస్తారు. ఇందుకోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.