తన భర్త శ్రీరామచంద్రుడనుకుంది.. కానీ..

మా ఆయన బంగారం. పక్కనుంచి ఎవరు వెళుతున్నా పట్టించుకోడనుకుంది. తన అంచనాలు తప్పుకావంటూ నిరూపించాలనుకుంది. కానీ సీన్ రివర్సై తన మాంగల్యానికే ఎసరు పెట్టింది మధ్యలో ఎంట్రీ ఇచ్చిన మరో యువతి. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన ఓ యువతి అమ్మమ్మా వాళ్లింట్లో ఉంటోంది. రామ్‌జీ, రామలక్ష్మీ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి అదే ఇంట్లోని మరో పోర్షన్‌లో అద్దెకు దిగారు. పక్క పోర్షన్‌లోని యువతితో మాటలు కలిపింది రామలక్ష్మి. ఈ క్రమంలోనే తన భర్త పరాయి స్త్రీల పట్ల ఎలా ఉంటాడో తెలుసుకోవాలనుకుంది. భర్తతో మాట్లాడమంటూ యువతిని పురిగొల్పింది.

రోజూ మాట్లాడుతుండడంతో ఆ అమ్మాయిని ప్రేమలోకి దించాడు రామ్‌జీ. మనిద్దరం పెళ్లి చేసుకుందామని నమ్మిచాడు. అదే విధంగా తిరుపతికి వెళ్లి పెళ్లి కూడా చేసుకున్నారు. తన కళ్ల ముందే ఇంత అన్యాయం జరుగుతున్నా ఏమీ చేయలేకపోయింది రామలక్ష్మి. భార్య గొడవపడడంతో పెళ్లి చేసుకున్న యువతితో ఖమ్మంలో కొత్త కాపురం పెట్టాడు రామ్‌జీ. రామలక్ష్మి లబోదిబో మంటూ తను చేసిన తప్పేంటో తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఖమ్మం వెళ్లి రామ్‌జీని, యువతిని అరెస్టు చేసి గాజువాక తీసుకువచ్చారు. ఇరువురికీ కౌన్సిలింగ్ ఇచ్చి రామ్‌జీని భార్య రామలక్ష్మికి అప్పగించారు. అయితే రామ్‌జీ ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని యువతి వాపోతోంది. నా పరిస్థితి ఏమిటి అంటూ పోలీసులను నిలదీస్తోంది.