అక్రమ సంబంధం.. హోంగార్డుని ఓ మహిళ మంచానికి కట్టేసి..

ప్రకాశం జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ప్రియుడిపై కోపంతో ఓ మహిళ అతన్ని మంచానికి కట్టేసి ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి చంపేసింది. అతని కేకలు విన్న చుట్టుపక్కలవాళ్లు కాపాడే ప్రయత్నం చేయబోయినా.. మంచానికి కట్టేసి ఉండడం వల్ల సాధ్యపడలేదు. కొనకనమిట్ల మండలం చౌటపాలెంలో జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పొదిలికి చెందిన షేక్‌ షబ్బీర్‌ మర్రిపూడి పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఇప్పటికే అతనికి రెండు పెళ్లిళ్లయ్యాయి. తాజాగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 3 నెలలుగా డ్యూటీకీ కూడా వెళ్లకుండా.. ఆ మహిళతో కలిసి బిజినెస్ పెట్టాడు. పేరారెడ్డిపల్లి, చౌటపల్లి గ్రామాల్లో కోళ్ల ఫారాలు చూసుకుంటూ ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఐతే.. ఆర్థిక వ్యవహారాల్లో ఇద్దరి మధ్య గొడవలు రావడంతో.. షబ్బీర్‌పై కోపం పెంచుకుంది షకీరా. అతన్ని చంపేయాలని ఫిక్స్ అయ్యింది. శనివారం రాత్రి పథకం ప్రకారం షబ్బీర్‌తో కలిసి ఉన్నప్పుడు ఫుల్లుగా మందు తాగించింది. తర్వాత మంచంపై పడుకున్న అతని కాళ్లు చేతులు కట్టేసింది. పెట్రోల్ పోసి నిప్పుపెట్టింది.

మంటలకు తాళలేక షబ్బీర్ వేసిన కేకలకు చుట్టుపక్కల వాళ్లు అతన్ని కాపాడబోయినా.. కుదరలేదు. కాళ్లు చేతులు మంచానికి కట్టేసి ఉండడంతో చివరికి సజీవదహనం అయిపోయాడు. నిందితురాలు షకీరా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది.