ముద్దుల భార్య కోసం మురిపెంగా భూగర్భంలో.. 23 ఏళ్లు..

ప్రేమించిన ప్రియురాలే భార్య అయితే ఆమె కోసం ప్రేమ సామ్రాజ్యాన్నే నిర్మిస్తానంటాడు సినిమాలో హీరో. ఇలాంటివి కథల్లో, సినిమాల్లో చాలానే చూస్తుంటాము. నిజంగా కూడా భార్య ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించి చరిత్రలో నిలిచిపోయాడు షాజహాన్. మరి షాజహాన్ పేరు పక్కన నా పేరు కూడా రాసుకోండి అంటున్నాడు ఆర్మేనియాకు చెందిన అరకెల్యాన్.

ఇతడు వృత్తిరీత్యా ఆర్కిటెక్చర్. భార్య టోస్యా ఓ రోజు భర్తతో అండర్ గ్రౌండ్‌లో అందమైన ఓ చిన్న ఇల్లు కట్టుకుందామని అడిగింది. ఆమె అడగడమే ఆలస్యం అర్జెంటుగా రంగంలోకి దిగిపోయాడు భర్త. తనని తాను మరచిపోయి భూగర్భంలో తవ్వడం మొదలు పెట్టాడు. అలా 23 ఏళ్లు కష్టపడి అండర్ గ్రౌండ్‌లో 7 అంతస్థుల భవనాన్ని నిర్మించాడు.

450 టన్నుల మట్టిని, రాళ్లను తొలగించి అందమైన కోటను కట్టాడు. రోజుకి 18గంటల పాటు శ్రమించేవాడు. ఇందు కోసం అతడు పెద్ద పెద్ద యంత్రాలను ఏమీ ఉపయోగించలేదని, కేవలం చేతి పనిముట్లను మాత్రమే వాడేవాడని భార్య తెలిపింది. కేవలం 6 వేల జనాభా మాత్రమే ఉన్న ఈ అరింజా గ్రామంలో అద్భుతమైన అరకెల్యాన్ కట్టడం కారణంగా రోజుకి కొన్ని వందల మంది పర్యాటకులు విచ్చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వం అతడి ప్రతిభను, కష్టాన్ని కొనియాడుతూ కోట్ల రూపాయలను బహుమతిగా ఇచ్చింది. తన కష్టాన్ని కనులారా వీక్షించి అందులో తన భార్యతో కలిసి కాపురం చేశాడు. అరకెల్యాన్ 67వ ఏట తనువు చాలించాడు.