కరణం కుటుంబం వైసీపీలో చేరుతుందా?

karanam-balaram-family-maybe-come-in-ycp

ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం… ఫ్యాక్షన్‌ కక్షలకు పెట్టింది పేరు.. ఈ నియోజకవర్గం పేరు వింటే చాలు కరణం, గొట్టిపాటి కుటుంబాల మధ్య నెలకొన్న దశాబ్దాల వైరం గుర్తుకు వస్తుంది. ఈ రెండు కుటుంబాల్లో ఒకరు అధికార పార్టీలో ఉంటే మరొకరు ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ఇంతకాలం ఆధిపత్యం కోసం కత్తులు దూసుకున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసిపి టికెట్‌పై అద్దంకి నుంచి పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను టిడిపి అధిష్టానం పార్టీలో చేర్చుకుంది. టీడీపీ గూటికి చేరిన గొట్టిపాటి రవి నియోజకవర్గంలో 4వందల కోట్లతో పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. 10 వేల మందికి వృద్దాప్య, వికలాంగ పింఛన్లు మంజూరు చేయించారు. దీంతో రాష్ట్రంలోనే పింఛన్ల మంజూరులో అద్దంకి ప్రథమస్థానంలో నిలిచింది. అలాగే 3 వేల మందికి సియం సహాయ నిధి నుంచి ఆర్ధిక సాయం అందించారు. 5 వేల మందికి పక్కా గృహాలు మంజూరు చేయించారు. వీటిలో ఇప్పటికే 3 వేల ఇళ్ళు పూర్తయ్యాయి. సాగర్‌ కాలువల ఆధునీకరణ చేపట్టి రైతులకు సాగునీరు, తాగునీరు అందించేలా కృషి చేశారు. వెనుకబడ్డ ప్రాంతాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో సిసి రోడ్లు, కాలువలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించడంతో ప్రత్యేక శ్రధ్ధ చూపించారు. పార్గీలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేపట్టడంతో గొట్టిపాటి రవికి అన్ని సామాజిక వర్గాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది.

అభివృద్ధిలోనే కాదు.. రాజకీయంగానూ గొట్టిపాటి తనదైన వ్యూహాలతో పట్టు నిలబెట్టుకున్నారు. ఒకసారి మార్టూరు నుంచి రెండుసార్లు అద్దంకి నుంచి తమ కుటుంబాన్ని ఓడించిన రవికుమార్ ను టిడిపిలోకి తీసుకురావడం కరణం కుటుంబానికి రుచించలేదు. పార్టీలో ఉంటూనే ఎమ్మెల్యే రవికుమార్‌కు వ్యతిరేకంగా తన గ్రూపు రాజకీయాలను నడిపారు. ఇరు వర్గీయుల మధ్య గొడవలు జరిగాయి. దాడులూ చేసుకున్నారు. దీంతో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి కరణం బలరాంకు నచ్చజెప్పాల్సి వచ్చింది. గత ఏడాది కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, ఇక నుంచి అద్దంకి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే గొట్టిపాటి రవి చూసుకుంటారని స్పష్టంగా చెప్పేశారు. దీంతో కరణం బలరాం అద్దంకిలో రాజకీయాలకు దూరంగా జరిగారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి తన రాజకీయ చాతుర్యాన్పి ప్రదర్శించారు. ఎంతో కాలంగా కరణం బలరాంను వెన్నంటి ఉన్న ప్రధాన నేతలను తనవైపు తిప్పుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ పధకాల్లో వీరికి ప్రాధాన్యం కల్పించారు. దీంతో ఇంతకాలం కరణం గ్రూపులో ఉన్న టిడిపి నేతలు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి జై కొట్టారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకే అంటున్నారు రవి వర్గీయులు. అయితే ఎన్నికల నాటికి ఈ రెండు గ్రూపులు సఖ్యంగా ఉండేలా చూసుకోవటంలో గొట్టిపాటి వ్యూహం ఫలిస్తుందా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు వైసిపి నుంచి టికెట్‌ ఆశిస్తూ ప్రచారం చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య కూడా కరణం వర్గం మద్దతు పొందేందుకు పావులు కదుపుతున్నారు. గతంలో అద్దంకి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న గరటయ్యకు ప్రత్యేక అనుచర వర్గం ఉంది. అయితే ఇక్కడే మరో మెలిక ఉంది. తన రాజకీయ ప్రత్యర్ధి గొట్టిపాటి రవిని ఓడించడానికి కరణం మాస్లర్‌ ప్లాన్‌ వేసి ఆయన తన అనుచరులతో సహా వైసిపిలో చేరి పోటీకి సై అంటే అప్పుడు పరిస్థితి ఏంటనే వాదన కూడా నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. మొత్తానికి రవికి ప్రస్తుతానికి అనుకూలంగానే పరిస్థితులు ఉన్నా.. చివరి నిమిషానికి ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది చూడాలి.

-ADVT-