పిజ్జా డెలివరీ బాయ్.. పియానోపై అద్భుత విన్యాసం..

ప్రతిభ అందరిలో ఉంటుంది. అది బయటపడే అవకాశం వచ్చినప్పుడు తానేంటో ప్రపంచానికి తెలుస్తుంది. పేరుకి డెలివరీ బాయ్. కానీ అతడి వేళ్లు అద్భుతంగా పియానోపై విన్యాసం చేయగలవు. ఎవరో పియానో వాయిస్తుంటే చూశాడు. అప్పట్నించి తాను నేర్చుకోవాలనుకున్నాడు. కళని నమ్ముకుంటే కూడేం పెడుతుందిరా.. ఏదైనా పని చేసుకోవాలి అని అమ్మ అటే సరేనంటూ డెలివరీ బాయ్‌గా చేరాడు 18 ఏళ్ల బ్రైస్ డుడల్.

 

అతడిలో అతర్గతంగా దాగి ఉన్న కళ అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉంది. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రానికి చెందిన డెట్రాయిట్ నగరంలోని వర్చెట్టి కుంటుంబం పిజ్జా ఆర్డర్ చేసింది. డుడల్ వారింటికి పిజ్జాను డెలివరీ చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో వారి ఇంట్లో ఉన్న పియానోని చూశాడు. దాన్ని చూడగానే ఒక్కసారిగా అతడికి ప్రాణం లేచివచ్చినట్లైంది. మీరేమీ అనుకోనంటే ఓసారి పియానో ప్లే చేయొచ్చా అంటూ ఆ ఇంటి వారిని రిక్వెస్ట్ చేశాడు. అందుకు జూలీ అన్యమనస్కంగా అంగీకరించింది.

ఓకే అనడమే తరువాయి వెంటనే పియానో ముందు కూర్చుని అద్భుతంగా పియానో వాయించడం మొదలు పెట్టాడు. అతడు ప్లే చేస్తున్న విధానానికి ఆశ్చర్యపోయిన జూలీ డుడల్‌ని పొగడ్తలతో ముంచేసింది. చిన్నప్పటి నుంచి పియానో ప్లే చేయడమంటే ఇష్టమని చెప్పాడు. తనకు స్కాలర్ షిప్ వస్తుందని ఆ డబ్బులతో పియానో నేర్చుకుంటానని ఆనందంగా చెప్పాడు జూలీకి. అతడు పియానో ప్లే చేస్తుండగా వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో డెలివరీ బాయ్ పాపులర్ అయిపోయాడు. లైకులు, షేర్లతో సోషల్ మీడియాలో డుడల్ వీడియో హల్ చల్ చేస్తోంది.