ఊహించని బాంబు పేలుడు.. ఉలిక్కి పడిన కర్నూలు నగరం

కర్నూలు నగరం ఉలిక్కి పడింది.. ఊహించని బాంబు పేలుడు ఘటన ముగ్గుర్ని బలితీసుకుంటే.. చుట్టుపక్కల ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది.. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక, బ్లాస్ట్‌ వెనుక కుట్ర దాగుందా..? పోలీసులు కూడా ఈ కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నాటు బాంబు పేలుడు ఘటనతో కర్నూలు నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.. నగర శివారు నంద్యాల చెక్‌ పోస్టు నుంచి జోహరాపురానికి వెళ్లే రహదారి పక్కన పొలాల్లో బాంబ్‌ పేలింది. ఘటనలో ఇద్దరు స్పాట్‌లో చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. ఇంకొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రాజశేఖర్‌, మల్లికార్జునతో పాటు ASI జంపాల శ్రీనివాస్ ఉన్నారు.

కర్నూలు నగరంలో జంపాల కుటుంబానికి మంచి పేరుంది. జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ స్థానికంగా ఎన్నో భవనాలు నిర్మించారు. ఇటీవల వీరిద్దరూ కర్నూలు శివారులోని 20 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి పొలం సర్వే చేయించారు. సోదరుడైన ఏఎస్సై జంపాల శ్రీనివాసులు, సర్వే డిపార్ట్‌మెంట్‌ డ్రైవర్‌ సుధాకర్‌ను పిలిపించారు. వీరంతా ల్యాండ్‌ సర్వే చేయిస్తున్న సమయంలో కూలీలు చెత్త పోగు చేసి నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఘటనలో మల్లికార్జున, రాజశేఖర్‌ స్పాట్‌లో చనిపోయారు.

ఒకే ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. అటు ఈ ఘటన కర్నూలు నగరంలో సంచనలం రేపింది. మరోవైపు జంపాల కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం లేదని స్థానికులు చెబుతున్నారు. మరి, ఈ ఘటన ఎలా జరిగింది..? పొలంలోకి బాంబ్‌ ఎలా వచ్చింది..? ఎవరైనా ఇక్కడ బాంబులను దాచారా..? లేక ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడా..? పేలుడుకి రియల్ ఎస్టేట్ గొడవలు ఏమైనా కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.