చిన్ని చిన్ని ఆశ పాట.. ఇప్పుడు సంస్కృత భాషలో.. వీడియో

ఆస్వాదించే మనసుండాలే కానీ ప్రతి పాటా హృదయాన్ని తాకుతుంది. పాటకు పరవశించని మనిషి ఉండరు. హాయిగా సముద్రపు తరంగాల్లా, కొండలలోనించి జాలువారుతున్న జలపాతంలా వారి గొంతులో నుంచి పదాలు పాటై వినిపిస్తుంటే వినేవారి ఒళ్లు పులకరిస్తుంది. మనసు మైమరచిపోతుంది. పాటకు భాషతో పనేముంది. భావం కూడా అర్థం కానవసరం లేదు.

దాదాపు 25 ఏళ్ల క్రితం వచ్చిన మణిరత్నం రోజా సినిమాలోని చిన్ని చిన్ని ఆశ పాట.. ఇప్పటికీ వింటుంటే కొత్తగానే అనిపిస్తుంది. తమిళ్‌లో విడుదలైన ఈ సినిమా తెలుగులో, హిందీలోకూడా సూపర్ హిట్టయింది. ఎన్ని భాషల్లో వచ్చినా ఈ పాట ఇప్పటికీ, ఎప్పటికీ వినాలనిపిస్తుంది.

తాజాగా సంస్కృతంలో ఈ పాటను పాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు ఔత్సాహికులు. దేవతల భాషగా పేరున్న సంస్కృత భాషని బ్రతికించుకోవాలనే వారి తాపత్రయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలని కాపాడుకునే ప్రయత్నం నిజంగా అభినందించదగ్గదే. ఈ పాటను సంస్కృత భాషలో పాడి దేశం దృష్టిని ఆకర్షించారు.


పనిచేసేటప్పుడు పాటలు వింటూ చేస్తే మరింత ఉత్సాహంగా పని చేయాలనిపిస్తుంది. పని అలసట తెలియకుండా ఉంటుంది. పాటకున్న మహత్యం అటువంటిది. పాలు తాగే పాపాయి నుంచి పండు ముదుసలి వరకు పాటకు పదం కలపాలని చూస్తుంటారు. అవకాశం లేకపోతే తల ఆడిస్తూ తన్మయత్వంలో మునిగిపోతుంటారు.

అంతరించి పోతున్న భాషల జాబితాల లిస్టులో సంస్కృత భాష ఉండకూడదనే ఓ మంచి ఉద్దేశంతో చిన్ని చిన్ని ఆశ పాటను సంస్కృత భాషలో పాడి ఈ చిన్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు సంస్కృత భాష పట్ల మక్కువ ఉన్న యువత. మరింత మంది వారి బాటలో పయనించాలని ఆశిద్దాం. సంస్కృత భాషని బతికించుకుందాం.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -