ఫ్రీ అని చెప్పి పడేస్తారు. అవసరం తీరాక..?

ప్రజాప్రతినిధి.. పేరులోనే ‘ప్రజా’ అనిపెట్టుకున్న మన నాయకులు ఏదో ఒక పేరుతో ప్రజల్లో ఉంటూ ఉంటారు. ఇక ఎలక్షన్ సీజన్ అయితే వారి హడావుడి మాములుగా ఉండదు. దీక్షలని, యాత్రలని, బస్సుయాత్రలని, పాదయాత్రలని, రథయాత్రలని.. ఒకటేమిటి.. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నాయకగణం అంతా ప్రజల ముంగిట్లోకి వాలిపోతారు ఏదో ఒక ‘యాత్ర’ పేరిట! వారి లక్ష్యం ఏంటి? Obviously ప్రజల మనసుల్లో చోటు సంపాదించడం, ఓటర్ల అభిమానాన్ని చూరగొనడం, గద్దెనెక్కడం! ఈ ప్రాసెస్ లో ఎన్నో విన్యాసాలు, వాగ్దానాలు మనం వినాలి. కనాలి. భరించాలి. ఆఫ్ కోర్స్.. వీటన్నిటికీ మనం అలవాటూ పడిపోయాం కూడా! అదేంటో అన్నీ ఫ్రీగా ఇస్తామంటారు. పుట్టినప్పటినుంచి పోయేదాకా.. పోయిన తర్వాత కూడా(పింఛను రూపంలో) అన్ని సమయాల్లోనూ మన వెన్నంటి ఉంటామంటారు. కలర్ టీవీలు , రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ లు, ఆడపిల్లకు సైకిళ్ళు, వారికి పెళ్ళైతే పుస్తెలు, డబ్బులు, వారి చదువులకు ఖర్చులు, ఉద్యోగం రాకపోతే వచ్చేవరకు నిరుద్యోగ భృతి, 45 ఏళ్లకే పింఛను.. అసలీ లిస్టుకు అంతూ పొంతూ లేని పరిస్థితి!

సగటు ఓటరు ఈ freebies ని చూసే నాయకుణ్ణి ఎన్నుకుంటాడా అంటే.. పూర్తిగా ‘కాదు’ అని చెప్పలేని పరిస్థితి! ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం వింటున్న జవాబు ఒకటే.. భారత్.. అభివృద్ధి చెందుతున్న దేశం అని! ఇక్కడ ఒక చిన్న ఇష్యూ చెప్పాలి. సుమారు 2, 3 ఏళ్ల క్రితం అనుకుంటా.. స్విట్జర్లాండ్ లో ప్రభుత్వం ప్రజలందరికీ పేద – ధనిక తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ కొంత డబ్బును ప్రతినెలా ఇచ్చేలా ఒక ప్రతిపాదన చేసింది. దాన్ని ప్రజల ముందుంచింది. దీన్నే యూనివర్సల్ బేసిక్ ఇన్ కమ్ స్కీమ్ (UBI) అంటారు. ఈ పథకం అమలు చేయాలా వద్ద అని రెఫరెండం (ప్రజాభిప్రాయం) కోరింది. చిత్రంగా, ఆ దేశ ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తమను ‘సోమరులుగా’ మార్చే ఇలాంటి స్కీమ్ వద్దేవద్దు అని తెగేసి చెప్పారు.

స్విట్జర్లాండ్ లో ప్రజల స్థితిగతులేంటి? ఎకనామిక్ ఇండెక్స్ ఎంత?.. ఇలాంటి విషయాలు పక్కనబెడితే.. వారి ‘స్పిరిట్’ నిజంగా మెచ్చుకోదగినదే. నాలుగు ఉచిత పథకాలు, ఎన్నికలప్పుడు డబ్బూ పడేస్తే ప్రజలు చచ్చినట్లు ఓటేస్తారు.. ఆ తరవాత కూడా పడుంటారు అనే భావన నాయకుల్లో రాకుండా చేయగలిగారు. మరి మన పరిస్థితేంటి? మనకు ఎన్నోరకాల పథకాలతో ఎరవేస్తున్న నాయకులు – మౌలికమైన విద్య – వైద్యంను పట్టించుకోకపోతే నిజంగా ప్రశ్నించే పరిస్థితులలో మనమున్నామా? ఉంటే, గల్లీగల్లీలో ఇప్పుడు కూడా ‘ఆకలి’ కేకలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఢిల్లీ లాంటి చోట్ల ‘ఆకలి’ చావులు ఎందుకు కనిపిస్తున్నాయి? మన ప్రభుత్వ ఆస్పత్రులలో చంటి పిల్లల్ని ఎలుకలు పీక్కుతిన్నా, మనం నాయకులను ప్రశ్నించలేం..! ఈ పరిస్థితికి కారణం ఎవరు?

ఇలాంటి ప్రశ్నలు వేసే దమ్ము.. చాలామందికి తగ్గిపోతోందా? ఎందుకంటే.. మనం నాయకుల freebies వలలో పూర్తిగా చిక్కుకుపోయాం! ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రభుత్వమైనా విద్య – వైద్యం తమ ప్రాధామ్యాలని చెప్పేదైతే నిజమే. ఆచరణలో మాత్రం ‘ నేతి బీరకాయలో నెయ్యి చందమే’. నాయకులు తలచుకుంటే మన సర్కారీ బడుల్ని, దవాఖానాల్ని బాగుచేయలేరా? అదేం రాకెట్ సైన్స్ కాదు కదా? ఫిట్నెస్ ఛాలెంజ్ లు, గ్రీన్ ఛాలెంజ్ లు విసిరే నాయకులు గవర్నమెంట్ స్కూల్ ఛాలెంజ్ లు, హాస్పిటల్ ఛాలెంజ్ లు విసిరితే వారిని ఎవరైనా ఎందుకు అనుసరించరు? పెద్ద పెద్ద నాయకులు తాము స్వయంగా ఒక స్కూల్ నో, హాస్పటల్ నో బాగుచేసి, ఆలా ముగ్గురిని నామినేట్ చేయలేరా? ఇదేమంత అసాధ్యమైన పని కాదు! అయితే ఇలాంటివి చెయ్యాలంటే మన నాయకులకు ఉండాల్సిన కనీస లక్షణం ‘చిత్తశుద్ధి’! అదే ఉంటే, ప్రజలకు మౌలిక వసతులు కల్పించి వారితో పాటు దేశం కూడా ఎదిగేలా ప్రణాళికలు రూపొందించడం మనకు పెద్ద కష్టమేం కాదు! ప్రణాళికా సంఘాలు, నీతి అయోగ్ ల వల్ల చేయలేనిదాన్ని చేసి చూపించడమూ అసాధ్యం కాదు. అయినా ఆ ‘చిత్తశుద్ధి’ లేని నాయకులు ఉన్నంతకాలం ఇంకో 30 ఏళ్లయినా మన దేశం అభివృద్ధి చెందుతూ…నే ఉంటుంది.

– సౌజన్య