తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. అధిక మాసం రావడంతో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది.. అటు తిరుచానూరులో నేటి నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శనం అమలు కానుంది.. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది టీటీడీ. సెప్టెంబర్‌ 12 నుంచి 21 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనుండగా.. అక్టోబర్‌ 9 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది. టీటీడీ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ఉత్సవాల్లో చోటుచేసుకున్న తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ఈవో అనిల్‌ సింఘాల్‌ తెలిపారు.

రెండు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని తట్టుకునే విధంగా పగడ్బందీ ఏర్పాట్లు చేయనుంది టీటీడీ. మాడ వీధుల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు అధికారులు.. అలాగే ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాల సేవలను సైతం బ్రహ్మోత్సవాల్లో వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఆగస్టు 31 లోపు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈవో స్పష్టం చేశారు.

ఉత్సవాల్లో ఇబ్బందులు తలెత్తకుండా వాహన సేవల్లో మార్పులు చేయనుంది టీటీడీ. శ్రీవారి వాహన సేవలు రాత్రి 8 గంటలకే ప్రారంభించనుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 7 లక్షల లడ్డూలను స్టాక్‌ పెట్టుకోనుంది. గరుడ వాహన సేవ రోజు కొండపైకి టూ వీలర్స్‌ అనుమతించబోమని ఈవో తెలిపారు. ఇక పిన్స్‌ సిస్టమ్‌, చైల్డ్‌ ట్యాగింగ్‌ సిస్టమ్‌ను ఈ ఏడాది కూడా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి చెప్పారు. పార్కింగ్‌ కోసం ప్రత్యేక యాప్‌ రూపొందించామన్నారు. బ్రహ్మోత్సవాల్లో యాప్‌ను ప్రారంభిస్తామన్నారు.

మరోవైపు భక్తులకి ఉపయోగపడేలా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు వీఐపీలు వచ్చినపుడు సాధారణ భక్తులని నిలిపివేసి.. వారికి దర్శనం కల్పించేవారు. దీనిపై విమర్శలు రావడంతో బ్రేక్‌ దర్శనం నిర్ణయం తీసుకుంది టీటీడీ. నేటి నుంచి తిరుచానూరులో వీఐపీ బ్రేక్‌ అమలు కానుంది. ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకూ సామాన్య భక్తుల క్యూలైన్లను నిలిపి వీఐపీలకు దర్శన కల్పించనున్నారు అధికారులు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -