‘సైరా’ వంశీకుల ఆవేదన.. ‘చిరు’ చిన్న సహాయమైనా చేయట్లేదంటూ..

ఆంగ్లేయుల దుష్టపాలనను ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. రాయలసీమలో రాయలకాలం నుండి పాళెగాండ్లు స్థానిక నాయకులుగా ఉండేవారు. వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ఒకరు. ఆంగ్లేయుల పాలనను ఎదిరించి 1847 ఫిబ్రవరిలో వీరమరణం పొందారు.

ఆ మహానుభావుడి చరిత్రను తెరకక్కించే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి. నరసింహారెడ్డిగా చిరంజీవి నటిస్తుండగా, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మొదలు పెట్టిన దగ్గర్నుంచి ఏదో ఒక ఆటంకం వచ్చి బ్రేకులతో ముందుకు సాగుతోంది. నిన్నటికినిన్న ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా సెట్ వేసారంటూ అధికారులు సెట్‌ని కూల్చివేసారు.

తాజాగా నరసిహారెడ్డి వంశస్తులు కూడా ఈ చిత్రం నిర్మించడం పట్ల ఆనందం వ్యక్తం చేసినా, తమని కనీసంగా కూడా పరిగణలోకి తీసుకోవట్లేదంటూ ఆవేదన చెందుతున్నారు. చిరంజీవి కానీ, రాంచరణ్ కానీ తమని పట్టించుకోవట్లేదని చెబుతున్నారు. కథాంశానికి మూలమైన తమని పక్కన పెట్టి వారి పని వారు చేసుకుంటున్నారని వాపోతున్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఉయ్యాలవాడ వంశీకులు పై అభిప్రాయాలను వ్యక్తం చేసారు.