నిరుద్యోగుల‌కు ఏపీ ప్రభుత్వం తీపిక‌బురు..

నిరుద్యోగుల‌కు ఏపీ ప్రభుత్వం తీపిక‌బురు అందించనుంది. నిరుద్యోగ భృతికి విధివిధానాలు ఖరారు చేయనుంది. గురువారం జరిగే మంత్రి వ‌ర్గ స‌మావేశంలో దీనిపై ఓ క్లారిటీ రానుంది.. ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పెద్ద కసరత్తే చేసింది. యువ‌సాధికారిక నిరుద్యోగ భృతిగా ఈ పథకానికి నామకరణం చేసిన చంద్రబాబు సర్కార్.. దాదాపు 12లక్షల 26వేల మంది నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చింది.

22 నుంచి 35 సంవ‌త్సరాల మధ్య వ‌య‌సు ఉండి.. డిగ్రీ, పాలిటెక్నిక్ చ‌దువుకుని, దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నవారిని అర్హులుగా ప్రకటించనుంది. నిరుద్యోగ భృతి కోసం 1470 కోట్ల రుపాయిలు ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. ఇప్పటికే బ‌డ్జెట్ లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయింపులు చేసింది. దీంతోపాటు నిరుద్యోగులకు అవ‌స‌ర‌మైన నైఫుణ్య శిక్షణ కూడా అందించనుంది చంద్రబాబు ప్రభుత్వం. నిరుద్యోగుల డేటాను ఆన్‌లైన్‌లో.. అన్ని కంపెనీల‌కు అందుబాటులో ఉంచనుంది. దీనివల్ల నైపుణ్యాలు కలిగిన వారికి ఉద్యోగ అవ‌కాశం పోందే అవకాశముంది. ఇప్పటికే నిర్వహించిన ప్రజాసాధికార స‌ర్వే డేటాను ఏపీ ప్రభుత్వం వినియోగించుకోనుంది.

అలాగే రాష్ట్రంలో వాహ‌నాల పొల్యూష‌న్‌ను త‌గ్గించే అంశంపై దృష్టి సారించనుంది కేబినెట్‌. ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎల‌క్ట్రిక‌ల్ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. దీనికి అనుగుణంగా ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాల విధానం ముసాయిదాలో మార్పులు చేర్పుల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఇక రాష్ట్రంలో నెల‌కొన్న తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌పైనా కేబినెట్ చర్చించనుంది. ఈ ఏడాది కరువు మండ‌లాల‌ను ముందుగానే గుర్తించే అంశంపై దృష్టిపెట్టనుంది. రెండు ప‌ర్యాటక ప్రాజెక్టుల‌తో పాటు .. ఏపిఐఐసికి భూకేటాయింపుల‌పైనా మంత్రి వర్గం నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే ఏపిలో త్వర‌లో చేపట్టే ప‌లు సాగునీటి ప్రాజెక్ట్ ల‌కు పాల‌న ప‌ర‌మైన అనుమ‌తులకు మంత్రి వ‌ర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.