ఇద్దరు బిడ్డలు మంచంమీద.. కన్నతల్లి కళ్లముందే..

అమ్మా అమ్మా.. అంటూ తన కొంగు పట్టుకుని ఆడుతూ పాడుతూ తిరగాల్సిన పిల్లలు.. అనారోగ్యంతో మంచంపై ఒకడు, మానసికంగా ఎదగని మరో పిల్లాడు. వారిద్దరిని ఆ పరిస్థితిలో చూడలేక తల్లి మనసు తల్లడిల్లింది. ఆవేదనతో మానసికంగా కృంగిపోయింది. చివరకు వారికళ్ల ముందే ఉరివేసుకుని తనువు చాలించింది. రాజేంద్ర నగర్ సమీపంలోని కిస్మత్‌పూర్‌కు చెందిన నవనీత, బబ్లూ దంపతులకు ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు అనారోగ్యం కారణంగా మంచంలో ఉంటే, చిన్నవాడు మానసిక వైకల్యం కారణంగా ఎదుగుదల లోపించింది. బబ్లూ హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లల పరిస్థితిని చూసి భార్యాభర్తలు తల్లడిల్లుతుండేవారు.

ఎలా పెంచాలో అనుకుంటూ మానసికంగా ఆవేదన చెందుతుండేవారు. భర్త పనికి వెళ్లి కొంత మర్చిపోయినా, భార్య నవనీత వారి బాగోగులు చూస్తూ ఇంటి పట్టునే ఉండడం, ఒక్క క్షణమైనా తాను లేకపోతే గడవని పరిస్థితి. ఈ క్రమంలోనే ఆమె చాలా వేదన అనుభవించేది. చివరికి తనవల్ల కాదంటూ మంగళవారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో చనిపోతున్నానంటూ తెలిసిన కానిస్టేబుల్‌కి సమాచారం అందించి ఉరివేసుకుంది. ఫోన్‌లో వద్దని వారిస్తూనే ఆమె భర్తని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చాడు. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. నవనీత ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. పక్కనే మంచం మీదున్న కుమారుడు కదలలేని స్థితిలో ఏడుస్తూ కనిపించాడు. ఇద్దరు బిడ్డల్నీ చూసి తండ్రి గుండెలవిసేలా రోదిస్తున్నాడు. అమ్మా ఆకలి అని అడగకుండానే బిడ్డల ఆకలి తెలుసుకుని ఓ ముద్దైనా పెట్టే అమ్మ ఇక లేదు. ఎవరు చూస్తారు ఆ బిడ్డల్ని. తను ఎన్ని బాధలైనా పడి తల్లి బిడ్డల్ని పెంచుతుందే. అలాంటిది అమ్మే నా వల్ల కాదంటూ వెళ్లిపోతే ఎవరు పట్టించుకుంటారు వారిని. అయ్యో.. తల్లీ.. ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నావంటూ స్థానికులు ఆ చిన్నారులను చూసి కంట తడిపెడుతున్నారు.