పరారీలో ఉన్న డీఎస్‌ తనయుడు సంజయ్‌

11-nursing-students-accuse-telangana-mp-d-srinivas-son-sexual-harassment

డీఎస్‌ తనయుడు.. మాజీ మేయర్‌ సంజయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. తమను సంజయ్‌ లైంగికంగా వేధిస్తున్నాడని శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు. అతనిపై కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేసి తమకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంజయ్‌పై నిర్భయ చట్టం సహా… 354, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సంజయ్‌… ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది..

నిజామాబాద్‌ నగర శివారులోని శాంకరి నర్సింగ్‌ కాలేజీలో మొత్తం 30 మంది విద్యార్థులు ఉండగా.. 13 మంది విద్యార్థినిలు ఉన్నారు. డీఎస్‌ చైర్మన్‌గా ఆయన పెద్ద కొడుకు సంజయ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఈ కాలేజీని మూడేళ్ల కిందట ఇతరులకు లీజ్‌కు ఇచ్చారు. అయితే ఇటీవల సంజయ్‌ తరచూ కాలేజీకి వస్తున్నాడని.. తమపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 11 మంది విద్యార్థినిలు ప్రగతిశీల మహిళా సంఘం సహకారంతో.. తల్లిదండ్రులతో కలిసి హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే హోంమంత్రి ఆదేశాలతో ఎసీపీ సుదర్శన్‌ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు.. ఆ వెంటనే మహిళలపై వేధింపుల చట్టం కింద పలు సెక్షన్లతో కేసులు నమోదు చేసి.. విచారణ ప్రారంభించారు..

అంతకుముందు… తనపై వచ్చిన ఆరోపణల సంజయ్ ఖండించారు. నర్సింగ్‌ విద్యార్థుల తాను వేధిస్తున్నాన్ననది అవాస్తమన్నారు. కాలేజీని మూడేళ్ల కిందటే లీజుకు ఇచ్చామని గుర్తు చేశారు. రాజకీయంగా తనను దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు సంజయ్‌..

మరోవైపు.. రాజకీయంగా అత్యంత కీలకమైన తరుణంలో… సంజయ్‌పై ఆరోపణలు రావడం… డీఎస్‌కు ఇబ్బందికర పరిణామమే అంటున్న రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఆయన టీఆర్‌ఎస్‌లో ఉంటారా.. లేక కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్తారా అన్న సందేహాలు వస్తున్న సమయంలో… తాజా ఆరోపణలు డీఎస్‌ను మరింత ఇరకాటంలోకి నెడుతాయనే అంటున్నారు. అటు డీఎస్‌ అభిమానులు మాత్రం ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి డీఎస్‌ను, సంజయ్‌ను తప్పించేందుకే కొందరు పనిగట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు.