తొలి టెస్టులో శతకంతో చెలరేగిపోయిన కోహ్లీ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్‌ కోహ్లీ అదరగొట్టేశాడు. ఒకవైపు సహచర బ్యాట్స్‌మెన్లు వెంటవెంటనే పెవిలియన్‌ బాట పడుతుంటే.. కోహ్లీ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా చివరిదాకా ఒంటరిపోరాటం చేశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ శతకంతో చెలరేగిపోయాడు. 225 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 149 పరుగులు చేశాడు. కోహ్లీ పోరాటంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు చేసింది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 287 పరుగులకు ఆలౌటైంది. రెండోరోజు మరో రెండు పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను షమీ ముగించాడు. తొలిరోజు రూటర్, బెయిర్‌ స్టో హాఫ్ సెంచరీలు చేయడంతో భారీస్కోర్ సాధిస్తుందనుకున్న ఇంగ్లీష్ టీమ్‌ను అశ్విన్‌ కట్టడి చేశాడు. నాలుగు కీలక వికెట్లతో ఆతిథ్య జట్టుకు బ్రేక్ వేశాడు. అలాగే మహ్మద్ షమీ కూడా 3 వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ 300 పరుగుల లోపే ముగిసింది.