ప్రేమ పేరుతో వేధింపులు.. తనువు చాలించిన జవాన్ భార్య

దేశ సరిహద్దులలో జవాన్ ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ.. దేశ రక్షణ కోసం శత్రువుల గుండెలో తూటాలు పేలుస్తుంటే.. ఓ మృగాడు ఒళ్లు కొవ్వెక్కి జవాన్ భార్యను ప్రేమిస్తున్నానంటూ వేధించడం ప్రారంభించాడు. అతడి వేధింపులకు తాళలేని ఆ అభాగ్యురాలు సజీవ దహనం చేసుకుని తనువు చాలించింది. కర్నాటకలోని విజయపురలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

కవితకు నటరాజు అనే వ్యక్తితో 12 ఏళ్లక్రితం వివాహమైంది. భర్త నటరాజ్ గౌహతిలో సైన్యంలో పనిచేస్తుంటే, ఆమె కొడుకుతో కలిసి విజయపుర పట్టణంలో నివసిస్తోంది. ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక కాలేజీకి వెళ్లి డిగ్రీ చదువుతుంది. ఈ క్రమంలో సాయికృష్ణ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ వేధించడం ప్రారంభించాడు. ఎన్ని సార్లు హెచ్చరించినా వెంటపడుతూనే ఉండేవాడు. పెద్దవాళ్లు మందలించినా ఆ యువకుడిలో మార్పు రాలేదు. రోజు రోజుకి కవితకు అతడినుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె బుధవారం ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.

తన ఆత్మహత్యకు సాయికృష్ణ వేధింపులే కారణమని మరణ వాంగ్మూలం ఇచ్చింది కవిత. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె గురువారం చనిపోయింది. దీంతో పోలీసులు సాయికృష్ణను అరెస్ట్‌ చేశారు.