ఎన్‌ఆర్‌సీ అంశంపై హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరణ

parliament-today-news

నాలుగు రోజుల పాటు రాజ్యసభను కుదిపేసిన ఎన్‌ఆర్‌సీపై ఇవాళ హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం విడుదల అయ్యింది కేవలం ముసాయిదా మాత్రమే అని.. ఫైనల్‌ జాబితా కాదని రాజ్‌నాథ్‌ మరోసారి స్పష్టం చేశారు. కేవలం సుప్రీం ఆదేశాలతోనే జాబితా రూపొందించామని వివరణ ఇచ్చారు. ఎన్‌ఆర్‌సీ పై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు..

రాజ్‌నాథ్‌ వివరణపై తృణమూల్‌ కాంగ్రెస్‌ సహా.. విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎంపీలు లేని నిలబడి ఆందోళన చేశారు.. చైర్మన్‌ వెంకయ్య నాయుడు నచ్చచెప్పడంతో సభా కార్యక్రమాలు సాగాయి..

లోక్‌సభలలోనూ ఎన్‌ఆర్‌సీ అంశం సెగ రేపింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఎన్‌ఆర్‌సీ జాబితా నుంచి తప్పించిన 40 లక్షల మంది పరిస్థితి ఏంటని నినలదీస్తూ నినాదాలు చేశారు.. ఆందోళనల మధ్యే స్పీకర్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగించే ప్రయత్నం చేశారు. దీంతో తృణమూల్‌ ఎంపీలు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి.. చప్పట్లు కొడుతూ గట్టిగా నినాదాలు చేశారు. తీవ్ర అసహనానికి గురైన స్పీకర్‌ సభను కాసేపు వాయిదా వేశారు..

తరువాత జాతీయ క్రీడా యూనివర్శిటీ బిల్లుపై జరిగిన చర్చలో క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కేంద్రాన్ని నిలదీశారు. మరోవైపు జాతీయ క్రీడలు నిర్వహించే అవకావం ఏపీకి ఇవ్వాలని కోరారు..

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి పన్నుల రాయితీ ఇస్తామని కేంద్రం ప్రకటించిందని ప్రస్తుతం ఇవ్వడం లేదని ఎంపీ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పన్నుల మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు..

ఏపీలో కాపులు రిజర్వేషన్లు లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని.. అందుకే కాపులకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసిందని ఎంపీ అవంతి శ్రీనివాస్‌ అన్నారు.. ఇప్పటికే ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని.. దాన్ని కేంద్రం ఆమోదించాలని కోరతూ ఆయన లోక్‌సభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టారు..

మరోవైపు విభజన హామీల అమలు కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీల పోరాటం కొసాగుతోంది. రోజూ పార్లమెంట్ బయట నిరసన తెలియజేస్తున్నారు. తెలుగు ప్రజల వాయిస్ వినిపిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా అనేక అంశాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని వియ్‌ వాంట్‌ జస్టిస్‌ అని నినాదాలు చేస్తున్నారు. సభ ప్రారంభానికి ముందు గాంధీ విగ్రహం, పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -