క్వార్టర్స్‌లో సైనా ఓటమి

saina-nehwal-satwiksairaj-rankireddy-ashwini-ponnappa-exit-quarters-loss-zheng-siwei-huang-yaqiong

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ సైనానెహ్వాల్ పోరాటం ముగిసింది. తనకు ఎంతో కలిసి వచ్చిన టోర్నీలో సైనా క్వార్టర్స్‌లోనే నిష్ర్కమించింది. ఏకపక్షంగా సాగిన పోరులో స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ చేతిలో సైనా ఘోరపరాజయం పాలైంది. మ్యాచ్‌లో పలు అనవసర తప్పిదాలు చేసిన హైదరాబాదీ షట్లర్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. నిజానికి గత రికార్డుల దృష్ట్యా ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అభిమానులు ఆశించారు. అయితే మారిన్‌ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. 31 నిమిషాల పాటు జరిగిన పోరులో మారిన్‌ 21-6, 21-11తో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. అటు మిక్సిడ్ డబుల్స్‌లోనూ భారత్‌కు నిరాశే మిగిలింది. పతకంపై ఆశలు రేకెత్తించిన భారత్ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్విని పొన్నప్ప ఇంటిదారి పట్టింది. ప్రపంచ రెండో ర్యాంకర్‌, టాప్‌ సీడ్‌ హువాంగ్‌-జెంగ్‌ సీవీ(చైనా) 21-17,21-10 స్కోర్‌తో సాత్విక్‌-అశ్విని జోడీపై విజయం సాధించింది. ఇక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ప్లేయర్స్ ఇద్దరే మిగిలారు. తెలుగుతేజం పీవీ సింధు, సాయి ప్రణీత్‌ ఈ రోజు క్వార్టర్స్‌ను అధిగమిస్తే కనీసం కాంస్య పతకాలు దక్కుతాయి. గత ఏడాది ఈ టోర్నీలో సింధు రజతం నెగ్గగా, సైనా కాంస్యం గెలుచుకుంది.