వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పివి సింధు అదరగొడుతోంది. ఇప్పటికే కాంస్యం ఖాయం చేసుకున్న సింధు సెమీస్‌లోనూ గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్ళింది. సెమీఫైనల్లో ఆమె 21-16,24-22 స్కోర్‌తో జపాన్ ప్లేయర్ యమగుచిని ఓడించింది. ఈ మ్యాచ్‌లో చిరస్మరణీయ ప్రదర్శన కనబరిచిన హైదరాబాదీ రెండు గేమ్స్‌లోనూ వెనుకబడి అనూహ్యంగా పుంజుకుంది. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుత పోరాటపటిమతో ఫైనల్‌కు చేరింది. ముఖ్యంగా రెండోగేమ్‌లో 11-19 స్కోర్‌తో వెనుకబడిపోయిన సింధు… తర్వాత అద్భుతమైన ఆటతీరుతో మ్యాచ్ కైవసం చేసుకుంది. దాదాపుగా మూడో గేమ్ ఖాయమనుకున్న దశలో చక్కని నెట్‌గేమ్‌తో అలరించిన సింధు మ్యాచ్‌ను గెలుచుకుంది. 53 నిమిషాల పాటు సాగిన పోరులో యమగుచి, సింధు హోరాహోరీగా తలపడ్డారు. గేమ్ ప్రారంభంలో ఎక్కువ శాతం యమగుచి ఆధిపత్యం కనబరిచినా… చివరి వరకూ దానిని కొనసాగించలేకపోయింది. జపాన్ ప్లేయర్‌పై సింధుకు ఇది ఏడో విజయం. అలాగే ఈ ఏడాదిలో రెండో విజయం. కాగా ఆదివారం జరిగే ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో సింధు తలపడబోతోంది. ఇప్పటి వరకూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు రెండు సార్లు కాంస్యం, ఒకసారి రజతం గెలిచిన సింధు ఈసారి ఫైనల్లోనూ విజయం సాధిస్తే ఈ టోర్నీలో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఇప్పటి వరకూ ఆరు పతకాలు సాధిస్తే… వాటిలో మూడు సింధు గెలిచినవే. ఈ సారి కూడా అదరగొట్టిన సింధు నాలుగో పతకాన్ని ఖాయం చేసుకోగా… రజతమా.. స్వర్ణమా అనేది ఆదివారం తేలిపోనుంది. ఈసారి ఖచ్చితంగా పతకం రంగు మార్చుకుంటా అని చెప్పిన తెలుగుతేజం దానిని ఎంతవరకూ నెరవేర్చుకుంటుందో వేచి చూడాలి.