ముగ్గురిని బలి తీసుకున్న ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్!

ఒక్క తప్పు ముగ్గురిని బలితీసుకుంది. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్ పచ్చని సంసారంలో చిచ్చుపెట్టింది. వివాహితతో వన్‌సైడ్ లవ్‌లో పడ్డాడు ఓ యువకుడు. భార్యను అనుమానించిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణం తట్టుకోలేక భార్య ప్రాణాలు తీసుకుంది. ఈ ఇద్దరి చావులకు కారకుడైన యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇంతకీ ఈ డెత్ గేమ్‌లో తప్పెవరిది?

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వాంబే కాలనీకి చెందిన చెక్కా బిందు బ్యూటీషియన్. దివాన్‌చెరు ప్రాంతంలోనే బ్యూటీషియన్‌గా పనిచేసే బిందుకు… అదే ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ల లవ్‌ మ్యారేజ్ గత ప్రేమికుల రోజునే జరిగింది. సంసారం సాఫీగా సాగిపోతోంది. ఇంతలో ఊహించని గండం వెంకటేష్ రూపంలో వచ్చింది. ఫేస్‌బుక్‌లో బిందుకు ఫ్రెండ్ అయ్యాడు వెంకటేష్. బిందు అమ్మమ్మది జంగారెడ్డిగూడెం. వెంకటేష్‌ది జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం కావడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న వెంకటేష్‌… తనను పెళ్లి చేసుకోవాలంటూ బిందును వేధించడం మొదలుపెట్టాడు.

ఇదివరకే పెళ్లయిన బిందు… ఇదే విషయం వెంకటేష్‌కు చెప్పింది. కానీ ఈ నీచుడు అటు నుంచి నరుక్కొచ్చాడు. ఆమె భర్త సాయికి ఫోన్‌ చేసి బిందు నేను పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పాడు. అంతేకాదు ఆమెను వదిలేయాలంటూ బెదిరించాడు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన సాయి… భార్యను అనుమానించి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేష్ తండ్రి కానిస్టేబుల్ కావడంతో నిరుపేదలైన సాయి కుటుంబ సభ్యులు కేసుల జోలికి పోలేదు.

సాయి ఆత్మహత్యకు కారణం వెంకటేషే అని తెలుసుకున్న బిందు… గత నెల 8వ తేదీన రాజమహేంద్రవరం రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై వెంకటేష్‌తో గొడవపడింది. తన భర్త మరణాన్ని తట్టుకోలేక ఆమె గోదావరిలో దూకి సూసైడ్ చేసుకుంది. ఈ కేసులో పోలీసులు వెంకటేష్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ దారుణాలన్నీ బయటపడ్డాయి. పోలీసుల విచారణ ఎదుర్కొంటున్న వెంకటేష్… పచ్చని సంసారంలో చిచ్చుపెట్టి ఇద్దరి చావుకు కారణమైనందుకు పశ్చత్తాప పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వెంకటేష్ చేసిన తప్పు భార్యాభర్తలను బలితీసుకుంది. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన బిందుకు ఆల్‌రెడీ పెళ్లయిందని తెలిసి కూడా పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం అతడు చేసిన పెద్ద తప్పు. అంతటితో ఆగకుండా ఆమె భర్తకు ఫోన్‌చేసి… బిందును నేను పెళ్లిచేసుకుంటానని చెప్పి మానసికంగా వేధించి ప్రాణాలు తీసుకునేలా చేశాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త దూరం కావడంతో తట్టుకోలేక బిందు చనిపోయేలా చేశాడు. చివరికి ఈ పాపాలు వెంటాడి వెంకటేష్‌ను బలితీసుకున్నాయి. సో, ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్‌పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.