దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే రూ.70 లక్షలు..

అందరూ చూస్తుండగానే ఆగంతకులు గన్ గురిపెట్టి రూ. 70 లక్షలు ఉన్న నగదు బ్యాగును ఎత్తుకెళ్లారు. దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే జరిగిన ఈ దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఢిల్లీకి చెందిన కాశిష్ బన్సాల్ ఈనెల 2న తన ఇంటి నుంచి కారులో నారాయణ ప్లైఓవర్ మీదుగా గురుగ్రామ్ వెళుతున్నారు. ముందునుంచి ఆయన కదలికల్ని గమనిస్తూ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ప్లైఓవర్‌పై అతడిని అడ్డగించి కారుని ఆపేశారు.

కారు వెనుక సీట్లో కూర్చున్న బన్సాల్ వారిని చూసి దిగేందుకు ప్రయత్నించగా.. నిందితులు అతడిని బెదిరించి రూ.70 లక్షలతో ఉన్న బ్యాగును తీసుకుని పారిపోయారు. ప్లైఓవర్ మధ్య జనసంచారం ఉన్నా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. దుండగుల చేతిలో ఉన్న తుపాకులు చూసి ఎవరూ వారిని అడ్డగించలేకపోయారు. బన్సాలీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెద్ద వ్యాపార వేత్త అయిన బన్సాల్‌కు ఢిల్లీలో మూడు పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి. ఈ చోరీ బన్సాలీకి బాగా తెలిసిన వ్యక్తులే చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు ప్రారంభించారు.