టీఆర్ఎస్ సెంచరీ కలకు ఈ 2 జిల్లాలే అడ్డా?

2014 సార్వత్రిక ఎన్నికల్లో హోరా హోరా పోరులో టీఆర్ఎస్ 63 స్థానాలు గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. తదనంతర పరిస్దితుల్లో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించి ఎమ్మెల్యేల సంఖ్యను 90 కు పెంచుకుంది టీఆర్ఎస్. 2019 లో వందసీట్ల పై గురి పెట్టిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. విపక్ష ఎమ్మెల్యేల సీట్ల పై గురిపెట్టారు. విపక్ష స్థానాలను గెలవడం అంతా ఈజీగా కనపడటం లేదు. ఇరవై స్థానాల్లో దాదాపు ఉద్దండులు గత కొంత కాలంగా గెలుస్తూ వస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో తిరుగులేని నేతలుగా చెలామణి అవుతున్నారు. ఈసారి ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. మంత్రులు, ఎంపీలు.. విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ది కార్యక్రమాలను పరిగెట్టించడంతో పాటు ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు.. ఆయా నియోజకర్గాల్లో టీఆర్ఎస్ టికెట్ ఎవరిని వరిస్తుంది.. ఉద్దండులను ఢీకొట్టే సత్తా ఉన్న లీడర్లెవరనేదే ఇప్పుడు ప్రశ్న. అభ్యర్ది ఎవరైనా కేసీఆర్ నాయకత్వం పై నమ్మకంతోనే ప్రజలు గెలిపిస్తారానే ధీమాతో టీఆర్ఎస్ ఉంది.

Image result for TRS KCR KTR

నల్గొండ జిల్లాలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూరునగర్ నుంచి, సీఎల్పీ లీడర్ జానారెడ్డి నాగార్జున సాగర్ నుంచి, ఉత్తమ్ పద్మావతి.. కోదాడ నుంచి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ మంత్రి జగదీశ్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రగతి సభలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఈ నలుగురినీ ఓడించే దీటైన లీడర్లెవరనేది చర్చనీయాంశంగా మారింది. హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి పోటీగా గత ఎన్నికల్లో శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను పోటీలో నిలబెట్టారు. ప్రస్తుతం శంకరమ్మ నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్నారు. అయితే మంత్రి జగదీష్ రెడ్డి, శంకరమ్మ వర్గీయులకు పడటం లేదు. నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదంటూ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. 2019లో శంకరమ్మకు అధిష్టానం తిరిగి టికెట్ ఇస్తుందా అనేది చూడాల్సిందే. ఇక కోదాడలోనూ బలమైన అభ్యర్థి లేరు. చందర్ రావు, శశిధర్ రెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డి పై నోముల నర్సింహయ్య పోటీ చేసి ఓఢిపోయారు. ఈసారి తిరిగి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. అటు జానారెడ్డి కాంగ్రెస్ గెలిస్తే సీఎం అవుతానంటూ ప్రచారం చేస్తూ మరో దఫా ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుంచి గెలుస్తూ వస్తున్నారు. టీడీపీ నుంచి కంచర్ల సోదరులు టీఆర్ఎస్ లో చేరడంతో ఈసారి గట్టిపోటి తప్పదనే అంచనా టీఆర్ఎస్ లో ఉంది. ఎలాగైనా ఓడిస్తామనే పట్టుదలతో అటు గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటు కంచర్ల సోదరులు పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దుబ్బాక నర్సింహరెడ్డి మూడో ప్లేస్ లో నిలిచారు. ఈసారి కంచర్ల భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేయనున్నారు.

Image result for TRS KCR KTR

ఖమ్మం జిల్లా మధిరలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అక్కడ సీపీఎం పార్టీ ద్వితీయ స్థానంలో నిలిచింది. మోత్కుపల్లి టీడీపీ నుంచి పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధిరలో టీఆర్ఎస్ ను గెలిపించేందుకు కృషి చేస్తున్నా.. దీటైన అభ్యర్ది లేకపోవడం మైనస్ గా మారింది. జహీరాబాద్ నుంచి గీతారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి ఆమె కూతురు పోటీ చేసేందుకు సిద్దమమవుతున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎర్రోళ్ల శ్రీనివాస్ పోటీకి రెడీ అవుతున్నారు. మాణిక్ రావు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ శివకుమార్ సైతం పోటీకి సిద్దమవుతున్నారు. ఇక్కడ మూడు గ్రూపులుగా విడిపోయారు టీఆర్ఎస్ నేతలు. ఇటీవలే హరీష్ రావుకు ఫిర్యాదు చేశారు జిల్లా నేతలు.

– మార్గం శ్రీనివాస్