తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయానికి టీటీడీపీ వ్యూహమిదే!

ttdp

ఓవైపు ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అధికార ప్రతిపక్షపార్టీలన్నీ క్యాడర్ ను సమాయత్తం చేస్తున్నాయి. ప్రగతి సభలతో టీఆర్ఎస్, బస్సు యాత్రలతో కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల గోదాలోకి దిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వెలుగువెలిగిన టీడీపీ.. రాష్ట్ర విభజనతో తెలంగాణలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ నుంచి హేమాహేమీలందరూ ఒకొక్కరుగా అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. టీటీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక కారెక్కుతుందా? మహాకూటమి అంటున్న కాంగ్రెస్ తో జతకడుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్.. రెండు పార్టీలు టీడీపీ క్యాడర్ తమతో వస్తే ప్లస్ అవుతుందనే అంచనాల్లో ఉన్నాయి. మరి టీటీడీపీ పరిస్ధితి ఏంటి? ఒంటరిపోరు చేసే పరిస్ధితి ఉందా?

2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని చెప్పుకోదగ్గ స్థానాలు గెలుపొందింది. మల్కాజ్ గిరి ఎంపీ స్థానంతో పాటు పదిహేనుమందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంది. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. పన్నెండు మంది ఎమ్మెల్యేలు దయాకర్ రావు నేతృత్వంలో టీఆర్ఎస్ లో చేరారు. చంద్రబాబు ఫోకస్ అంతా ఏపీలో ప్రభుత్వ పాలన.. పార్టీ బలోపేతంపై దృష్టిసారించడంతో తెలంగాణలో కీలక నేతలంతా ఒకొక్కరుగా అటు
టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రేవంత్ రెడ్డి తోపాటు కీలక నేతలంతా కాంగ్రెస్ లో చేరడంతో.. ఇక రమణ, పెద్దిరెడ్డి, సండ్ర, రావుల, నామా, దేవేందర్ గౌడ్ ఫ్యామిలీ మాత్రమే టీడీపీలో ఉంది. ఆర్.కృష్ణయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ బీసీ సంఘం నేతగానే చెలామణి అవుతున్నారు.

గ్రేటర్ పరిధిలో బీజేపీతో కలిసి 24 అసెంబ్లీ స్థానాలకు గాను పదిహేను స్థానాలు గెలుపొందింది. ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ గూటికి చేరారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక స్థానానికే పరిమితమయింది. అయితే లీడర్లంతా కారు, హస్తం వైపు వెళ్లినా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ క్యాడర్ టీడీపీ లోనే ఉంది. నిజామాబాద్ జిల్లాలో అన్నపూర్ణమ్మ, మండవ వెంకటేశ్వరావు స్తబ్దంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో నామా, సండ్ర తిరిగి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. అయితే టీడీపీ నుంచే పోటీ చేయాలా, లేక కాంగ్రెస్ లో చేరాలా అన్న మీమాంసలో ఉన్నారు. మహాకూటమి ఏర్పాటు చేస్తాం.. అవసరమైతే టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటామని పీసీసీ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో సండ్ర, నామాలు టీడీపీ టికెట్ పై నే పోటీ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ పొత్తు కుదరకపోతే కాంగ్రెస్ లోచేరి హస్తం గుర్తు పై పోటీ చేసే అవకాశం ఉంది.

ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎన్డీఏ నుంచి వైదొలిగిన టీడీపీ తృతీయ ప్రంట్ దిశగా ఆలోచనలు చేస్తోంది. జాతీయస్థాయిలో కలిసివచ్చే పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటుకు చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు కు సై అంటోంది. అయితే రాష్ట్రాన్ని విభజించి ఏపీకి అన్యాయం చేశారనే భావన ఏపీ ప్రజల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ప్రజలు హర్షి్స్తారా లేరా అనే మీమాంసలో జాతీయ నాయకత్వం ఉంది.

టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ తో టీడీపీ ఎమ్మెల్యేలందరిని తన వైపు లాక్కుంది. కొన్ని జిల్లాల్లో టీడీపీ క్యాడర్ బలంగా ఉందని నమ్ముతున్న టీఆర్ఎస్ తొలుత ఆ పార్టీతో పొత్తుకు ఆలోచించింది. తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నేతలు టీడీపీలోని సీనియర్లతో చర్చలు సైతం జరిపారు. ఇప్పటికి టీడీపీ రెండు పార్టీలకు సమాన దూరం పాటిస్తూ.. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిద్దామన్నట్టుగా ఉంది.

ఒంటరిగా పోటీ చేస్తే ఒకటి రెండు స్థానాలు మినహా గెలుపొందే స్ధితిలో తెలంగాణలో టీడీపీ లేదు. అదే టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే పది స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు గెలుపొందవచ్చనే ఆలోచన సైతం ఆ పార్టీ చేస్తోంది. ఎన్నికల సమయం వరకు ఒంటరిగా పార్టీని బలోపేతం చేస్తూనే.. పొత్తుల అంశం వచ్చినపుడు ప్రజల మూడ్ ను అనుసరించి పొత్తు దిశగా వెళ్లే ప్లాన్ లో ఉంది.

– మార్గం శ్రీనివాస్