స్వర్ణ పతకానికి అడుగు దూరంలో పీవీ సింధు

స్టార్‌ షట్లర్‌.. తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. బ్యాడ్మింటన్‌ విశ్వ విజేతగా నిలిచే తొలి భారతీయ షట్లర్‌గా రికార్డుల్లో నిలిచేందుకు ఎదురు చూస్తోంది. గతేడాది కూడా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేరినా.. కేవలం సిల్వర్‌తో సంతృప్తి చెందింది. అందుకే ఈ సారి ఎట్టిపరిస్తితిలోనూ గోల్డ్‌ మిస్‌ కాకుడదనే లక్ష్యంతో ఫైనల్‌కు సిద్ధమైంది సింధు..

2014, 2015ల్లో విశ్వ విజేతగా నిలిచిన కరోలిని మారిన్‌తో ఫైనల్‌ ఫైట్‌కు సింధు సై అంటోంది. ఇప్పటికే ఈ ఈవెంట్లో రెండు సార్లు బ్రాంజ్‌, ఒక సారి సిల్వర్‌ మెడల్‌ నెగ్గిన తెలుగు స్టార్‌.. ఈ సారి స్వర్ణాన్ని గురి చేస్తోంది. మరోవైపు ఒలింపిక్స్‌ ఫైనల్లోనూ కరోలినా చేతిలో ఓడి బంగారు పతకాన్ని మిస్సైన సింధు ఈ సారి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో కనిపిస్తోంది..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్లో వరుసగా ఐదోసారి బరిలోకి దిగి.. నాలుగోసారి పతకాన్ని ఖాయం చేసుకున్న సింధు పసిడి పోరుకు రెడీ అయ్యింది. ఫైనలిస్ట్‌ మారిన్‌తో సింధు 5-6తో వెనుకబడి ఉంది. అయితే వరుసగా గత నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రం మారిన్‌పై సింధుదే పైచేయిగా ఉంది. మరి ఈ సారి ఎవరూ పై చేయి సాధిస్తారో చూడాలి..