ప్రమాదానికి గురైన బ్యాటరీ కారు.. ఇద్దరు మృతి

car-accident-in-vishakha-kailashgiri

విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిలో… టూరిస్టుల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. శివపార్వతుల విగ్రహాల నుంచి కిందికి బయల్దేరిన ఓ బ్యాటరీ కారు ప్రమాదానికి గురైన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రాజ్యలక్ష్మి అనే మహిళ అక్కడిక్కడే చనిపోగా… కారు డ్రైవర్‌ అప్పలరాజు… KGH లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతంలో వేగంగా బ్యాటరీ కారు నడపడం వల్లే అదుపుతప్పి…. బస్‌షెల్టర్‌ను ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన రాజ్యలక్ష్మి బెంగళూరు వాసి. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా వైజాగ్‌ పర్యటనకు వచ్చిన ఆమె ఇలా దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది.

మరోవైపు.. అసలు కైలాసగిరిపై బ్యాటరీ కారు నడపడానికే అనుమతి లేదన్నది స్థానికుల వాదన. అధికారుల పర్మిషన్‌ లేకుండా కారు ఎవరు నడుపుతున్నారన్న దానిపై… పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే పర్యాటకులు మాత్రం అధికారులపైనే మండిపడుతున్నారు. అనుమతుల్లేని కారు బహిరంగంగా చక్కర్లు కొడుతుంటే ఇంతకాలం అందరూ ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు. బ్యాటరీకారు నిర్వాహకులతో పాటు కైలాస గిరి అధికారులను కఠినంగా శిక్షించాలని మృతుల బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.