డీఎస్‌కు ‘స‌న్’ స్ట్రోక్..

తెలంగాణ‌లో సీనియ‌ర్ నేత‌కు స‌న్ స్ట్రోక్ త‌గిలింది. ద‌శాబ్దాల పాటు రాజ‌కీయాల్లోనే గ‌డిపిన ఆయ‌న‌కు తీవ్ర ప‌రాభవం త‌ప్ప‌డం లేదు. ఉమ్మ‌డి రాష్ట్రంలో రెండు సార్లు ప్ర‌భుత్వాల‌ను గెలిపించిన ఆ నేత రాజ‌కీయ జీవితం ఇప్పుడు స‌న్ స్ట్రోక్ తో మ‌స‌క‌బారుతోంది. ఆయ‌నే ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్. నిజామాబాద్ జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ముద్ర‌వేసుకుని రాష్ట్ర రాకీయాల్లో చ‌క్రం తిప్పారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేయ‌డంలో కీలత పాత్ర పోషించారు. వైయ‌స్ తో క‌లిసి క‌ష్టకాలంలో కాంగ్రెస్ కు రాజ్యాధికారాన్ని తెచ్చిపెట్టిన చ‌తుర‌త నేడు మూగ‌బోతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అద్య‌క్షుడిగా కాంగ్రెస్ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టారు. ప్ర‌తిప‌క్షాల వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ త‌న‌దైన రీతిలో రాజ‌కీయాలు చేయ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి.

తెలంగాణ ఏర్పాట‌య్యాక సొంత పార్టీలో ప్రాధాన్య‌త త‌గ్గ‌డం, ఎమ్మెల్సీ సీటు ఇవ్వ‌క‌పోవడంతో కాంగ్రెస్ అధినాయ‌క‌త్వంతో విభేదించి టీఆర్ఎస్ పార్టీ వైపు అడుగులు వేసారు. కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యంతో ఆయ‌న ఘ‌నంగా పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కొన్ని రోజుల వ‌ర‌కు ఆయ‌న‌కు ఏ ప‌ద‌వీ ఇవ్వ‌క‌పోయినా ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయారు. ఆ తరువాత కేసీఆర్ ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటు ఇచ్చి గౌర‌వించారు. ప్ర‌స్తుతం ఆయ‌న టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.

డీఎస్ కు ఇద్ద‌రు కుమారులు అర‌వింద్, సంజ‌య్. స్థానిక రాజ‌కీయాల్లో ఒక‌రు ఉంటే మ‌రొక‌రు విద్యారంగంతో పాటు వ్యాపారాలు చూసుకుంటున్నారు. నిజామాబాద్ రాజకీయాల్లో త‌న‌దైన ముద్ర‌ వేసుకున్న డీఎస్.. ఇంట్లో మాత్రం త‌న పిల్ల‌ల‌ అభిష్టాల‌ను వ్య‌తిరేకించలేకపోయారు. ఈ క్ర‌మంలో మోడీ పాల‌నపై ఆక‌ర్షితుడైన డీఎస్ చిన్న‌కొడుకు అర‌వింద్ బీజేపీలో చేరారు. ఇక్క‌డ నుండి అస‌లు క‌థ మొద‌లైంది. అర‌వింద్.. నిజామాబాద్ లో టీఆర్ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నాడరని స్థానిక నేత‌లు, కేసీఆర్ కూతురు క‌విత‌కు స‌మాచారం చేర‌వేశారు. ఇక బీజేపీలో చేరిన అర‌వింద్ క్యాడ‌ర్ ను పోగుచేసుకుంటున్నారు.

మ‌రో ఏడాది కాలంలో ఎన్నిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో త‌న సొంత కార్య‌క‌ర్త‌ల‌ను పెంచుకోవ‌డంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీచేసే అవ‌కాశాలున్నాయ‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. దీంతో టీఆర్ఎస్ క్యాడ‌ర్ ఆయ‌న తీరుపై తీవ్ర ఆగ్ర‌హం తో ఉంది. ప్ర‌స్తుతం నిజామాబాద్ ఎంపీగా కొన‌సాగుతున్న కవిత.. అర‌వింద్ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్ గా తీసుకున్నారు.

అర‌వింద్ కు డీఎస్ కూడా స‌హ‌క‌రిస్తున్నారంటూ ఆయ‌న‌ను పార్టీ నుండి బ‌హిష్కరించాలంటూ టీఆర్ఎస్ నిజామాబాద్ కార్య‌వ‌ర్గం తీర్మాణం చేసి అధినేత కేసీఆర్ కు పంపించారు. అయితే దీనిపై కేసీఆర్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు. త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన డీఎస్ ను పార్టీ నుండి పంపించ‌లేకపోయారు. మ‌రోవైపు డీఎస్ కూడా ఈ వ్య‌వ‌హారంపై ఎక్క‌డా నోరు మెద‌ప‌లేదు. స్థానిక‌ పార్టీ నేత‌ల‌పై ఎక్క‌డా ఒక్క‌మాట కూడా మాట్ల‌డలేదు. ఇక రాజ్య‌స‌భ స్థానానికి కూడా రాజీనామా చేయ‌లేదు. దీంతో ఇక్క‌డి వ‌ర‌కు ఈ విష‌యం స‌ద్దుమ‌నిగింద‌ని భావించారంతా. కాని ఇక్క‌డి నుంచే అస‌లు స‌మ‌స్య మొద‌లు కాబోతున్న‌ద‌న్న‌ది డీఎస్ తో స‌హా ఎవ‌రూ వూహించ‌లేకపోయారు. అర‌వింద్ మాత్రం తాను ఇప్పుడు త‌న తండ్రితో గాని త‌న సోద‌రుడితో గాని కలిసి ఉండ‌టం లేద‌ని.. ఇర‌వై ఏళ్ళుగా ఎవ‌రి వ్య‌వ‌హారాలు వారు చూసుకుంటున్నామ‌ని చెబుతున్నారు. కేవ‌లం రాజ‌కీయ క‌క్షతోనే ఇదంతా జ‌రుగుతోంద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. ఇది పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం అన్నారు.

అర‌వింద్ వ్య‌వ‌హారంలో పీక‌ల్లోతుల్లో కూరుకుపోయిన డీఎస్ కు తాజాగా మ‌రో స్ట్రోక్ త‌గిలింది. త‌న పెద్ద కుమారుడు నిజ‌మాబాద్ మాజీ మేయ‌ర్ సంజ‌య్ వ్య‌వ‌హారం మ‌రిన్ని వివాదాల‌కు దారి తీసింది. ఇది డీఎస్ మెడ‌కు చుట్టుకుంటోంది. సంజ‌య్ తమ‌ను లైంగికంగా వేధిస్తున్నారంటూ నిజామాబాద్ లో శాంకరీ న‌ర్సింగ్ క‌ళాశాల‌కు చెందిన విద్యార్దినులు నేరుగా హైద‌రాబాద్ కు వ‌చ్చి సంజ‌య్ పై స‌చివాలయంలో రాష్ట్ర హోంమంత్రి నాయ‌ని న‌ర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. త‌మ‌ను క‌ళాశాల‌లో వేధించ‌డ‌మే కాకుండా ఇంటికి పిలిపించుకుని విద్యార్థినుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారని.. లైంగిక కోరికలు తీర్చాలంటూ వేధిస్తున్నాడరని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

విద్యార్థుల ఫిర్య‌ాదుల‌పై స్పందించిన హోంమంత్రి సంజ‌య్ వ్య‌వ‌హారంలో పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపించాలని పోలీసులను ఆదేశించారు. దీంతో వెంట‌నే స్పందించిన పోలీసులు సంజ‌య్ పై నిర్భ‌య యాక్ట్ కింద కేసు న‌మోదు చేశారు. అయితే ఆయ‌న మాత్రం త‌ను ఆ ఎడ్యుకేష‌న్ల‌ను గ‌తంలోనే ఇత‌రుల‌కు లీజ్ కు ఇచ్చాన‌ని.. త‌న‌కు ఆ సంస్థ‌తో ప్ర‌స్తుతం సంబంధం లేదంటున్నారు. కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కోస‌మే త‌న‌పై అన‌వ‌స‌ర నింద‌లు మోపుతున్నార‌ని సంజ‌య్ చెబుతున్నారు. సంజ‌య్ వాద‌న ఎలా ఉన్నా పోలీసులు మాత్రం ఆయ‌నపై కేసు న‌మోదు చేసి విద్యార్దుల ఫిర్యాదుల‌ను స్వీక‌రిస్తున్నారు. ఆయ‌న‌పై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు.. ప్ర‌స్తుతం సంజ‌య్ ప‌రారిలో ఉండడంతో .. ఎప్పుడు క‌నిపిస్తే అప్పుడు అదుపులోకి తీసుకునేందుకు సిద్దంగా ఉన్నారు.

ఈ వ‌య‌సులో తోడుగా ఉంటార‌నుకున్న ఇద్ద‌రు కుమారులు ఇలా త‌న రాజ‌కీయ జీవితానికే మ‌చ్చ తెస్తార‌ని ఊహించ‌లేకపోయారీ రాజ‌కీయ మేధావి. ఇద్ద‌రు కుమారులు చేస్తున్న వ్య‌వ‌హారాల‌ు.. ఆయన రాజ‌కీయ జీవితాన్ని మ‌స‌క‌బారుస్తున్నాయి. ఓ అధికార పార్టీ నేత‌గా ఉండి.. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉండి కూడా త‌న కుమారులను గాడిలో పెట్టుకోలేకపోయారు. వారి వ్య‌వ‌హారాల‌ను అదుపుచేయ‌లేకపోయార‌న్న విమర్శ‌లు వ‌స్తున్నాయి. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన పార్టీ న‌మ్మ‌కాన్ని కూడా ఆయ‌న నిలబెట్టుకోలేకపోయార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఆయ‌న ప్ర‌మేయం , స‌పోర్ట్ లేకుండా కొడుకులు మ‌రో పార్టీలో చేరే అవ‌కాశ‌మే లేదంటున్నాయి నిజ‌ామాబాద్ టీఆర్ఎస్ వ‌ర్గాలు. అంతేకాకుండా త‌న క్యాడ‌ర్ ను అర‌వింద్ వెంట పంపేందుకు అంత‌ర్గ‌తంగా స‌హ‌క‌రిస్తున్నార‌ని క‌విత‌తో స‌హా అక్క‌డి క్యాడ‌ర్ గుర్రుగా ఉన్నారు. ఇక సంజ‌య్ వ్య‌వ‌హారం కూడా తోడ‌వ‌డంతో డీఎస్ కు క‌ష్టాలు త‌ప్పేలా లేవు. త‌న ప్ర‌మేయం లేకపోయినా .. త‌న‌ప‌ని తాను చేసుకుంటూపోతున్నా త‌న కుమారులు చేసిన త‌ప్పుల‌కు ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ కు స‌న్ స్ట్రోక్ త‌ప్పేలా లేదు. అయితే ఇంత జ‌రుగుతున్నా అటు డీఎస్ కాని ఇటు కేసీఆర్ కాని ఈ వ్య‌వ‌హారంలో ఇంత‌వ‌ర‌కు నోరుమెద‌పక పోవ‌డం కొస‌మెరుపు .

– మార్గం శ్రీనివాస్