టీచర్‌కి 29.. స్టూడెంట్‌కి 15.. ఇద్దరూ కలిసి..

ప్రతి మనిషి వ్యక్తిగా ఎదగాలి.. వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలి.. అందుకు పునాది బాల్యంలోనే పడాలి.. కనిపెంచిన తల్లిదండ్రులతో పాటు పాఠశాలలో విద్యాబుద్దులు నేర్పించే ఉపాధ్యాయుల పాత్ర కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ఉపాధ్యాయుల సహకారం మరువలేనిది. మరి అలాంటి టీచర్లు పిల్లలకు పాఠాలు నేర్పకుండా పక్కదారెందుకు పడుతున్నారు. మేమూ మీలాంటి మనుషులమే అని తెలియజెబుతున్నారా? మాలోనూ కోర్కెల ఊహలకు రెక్కలు వస్తున్నాయంటున్నారా? అందుకేనేమో గురువులు కూడా ఆడపిల్లల వైపు గుడ్లప్పగించి చూస్తున్నారు.

మగ పిల్లలు సైతం ఇలాంటి వారి అరాచకాలకు బలైపోతున్నారు. బుద్దిగా చదువుకోరా నాయనా అని స్కూలుకు పంపిస్తే చదవకపోగా.. టీచర్‌తోనే ప్రేమాయణం సాగించాడు. పోనీ వయసులో ఏమైనా పెద్దవాడా అంటే అదీ కాదు. విద్యాబుద్దులు నేర్పించకుండా విద్యార్థులను చెడు దారిలోకి మళ్లించింది. ప్రేమ పాఠాలు వల్లించింది ఓ పంతులమ్మ. విద్యార్థి జీవితాన్ని నాశనం చేసింది. ఈమధ్య జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేదిగా ఉంది. హర్యానా ఫతేబాద్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడు స్థానిక పాఠశాలలో చదువుతున్నాడు. స్కూల్లో పని చేస్తున్న టీచర్‌ తరగతి గదిలో పాఠాలు చెప్పడం మానేసి విద్యార్థులతో బాతాఖానీ పెట్టేది. ఈ క్రమంలోనే టీచర్ ఓ విద్యార్థిపై మనసు పారేసుకుంది.

ఫోన్‌లో చిట్ చాట్‌లు, వాట్సాప్‌లో మెసేజ్‌లు సాగించారు కొంతకాలం. ఆ తరువాత ఒకరోజు విద్యార్థితో ఎక్కడికైనా పారిపోదాం అని చెప్పడంతో వాడు కూడా ఓకే అన్నాడు. ప్లాను ప్రకారం ఇద్దరూ కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. రాత్రైనా పిల్లవాడు స్కూల్ నుంచి ఇంటికి రాలేదని కంగారు పడ్డారు తల్లిదండ్రులు. పాఠశాల యాజమాన్యాన్ని విచారించేసరికి అసలు విషయం బయటపడింది. అప్పటికి గానీ తల్లిదండ్రులకు తాము తమ బిడ్డ పట్ల ఎంత అజాగ్రత్తగా ఉన్నామన్న విషయం బోధపడలేదు. కంగారు పడుతూ పోలీసుల సహాయంతో బాలుడ్ని వెతికే ప్రయత్నం చేశారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఆ జంట ఎక్కడుందో గుర్తించారు. జమ్మూకశ్మీర్‌‌లో ఉన్న వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఎంక్వైరీలో ఈ జంట పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం చెప్పారు. టీచర్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. కుటుంబసభ్యులు బాలుడికి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.

పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయులు, చదువుకోవాల్సిన విద్యార్థులు వయసు తారతమ్యాల్ని కూడా మరచి అసహజ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మరి ఉత్తమ పౌరులు ఎలా తయారవుతారు. ప్రతినెలా విద్యార్థులకు పేరెంట్స్ మీటింగ్ పెట్టినట్లు, టీచర్స్‌కి విద్యార్థుల పట్ల ఎలా మెలగాలి అనే దానిపై అవగాహన ఇస్తూ మీటింగ్ పెట్టాలేమో. పిల్లల్ని కూడా క్లాసులో టీచర్లు ఎలా ఉంటున్నారు, పాఠాలు ఎలా చెబుతున్నారు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తుండాలి. ఇలాంటి కొన్ని ముందు జాగ్రత్తచర్యల కారణంగా పరిస్థితిలో కొంతైనా మార్పు వచ్చే అవకాశం ఉంది.