శేఖర్ కమ్ముల స్కూల్ విద్యార్థి ‘శశికిరణ్’.. ‘గూఢచారి’ బ్లాక్ బస్టర్

స్కూల్ మంచిదైతే సరిపోదు. అందులో పాఠాలు చెప్పే మాష్టార్లు కూడా బాగా చెబితేనే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తయారవుతారు. పెద్దయ్యాక మంచి ఉద్యోగం తెచ్చుకుని లైఫ్‌లో సెటిల్ అయితే తనను చిన్నప్పుడు తీర్చిదిద్దిన మాష్టారు గురించి సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తుంటారు. ఇండస్ట్రీలో కూడా అలాంటి గురువులే కొందరుంటారు.

తనకంటూ ఇండస్ట్రీలో ఓ ముద్ర వేసుకున్న శేఖర్ కమ్ముల మంచి చిత్రాలకు మారుపేరుగా నిలుస్తారు. కమ్మని కాఫీలా, గోదావరి నదీ ప్రవాహంలా సాగిపోతుంటాయి అతడి చిత్రాలు. అందుకే కుటుంబం మొత్తాన్ని థియేటర్ వైపు అడుగులు వేయిస్తాయి. సాప్ట్ సినిమాలే కాదు.. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించే ఓ ఉత్తమ పౌరుడు రాజకీయ నాయకుడిగా ఎదిగితే ఎలా ఉంటుందనేదాన్ని ‘లీడర్’ సినిమా ద్వారా చూపించారు శేఖర్.

ఆయన స్కూల్లో పాఠాలు నేర్చుకుని అతడి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు శిష్యులు నాగ్ అశ్విన్, శశికిరణ్‌లు. ఆ విషయాన్ని ‘మహానటి’ ద్వారా మరోసారి నిరూపించుకున్నారు నాగ్ అశ్విన్. తాజాగా ‘గుఢచారి’ చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు శశికిరణ్ ప్రేక్షకులకు తన మార్కుని చూపించాడు.

ప్రేక్షకుల ప్రశంసలు పొందుతూనే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది గూఢచారి. ఐఎమ్ డిబి రేటింగ్‌లో 9.1 సాధించి తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలని పతాక స్థాయికి చేర్చింది ఈ చిత్రం. మంచి చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారని మరోసారి నిరూపించింది గూఢచారి.