అమ్మ అగ్నికి ఆహుతి.. ఇద్దరు బిడ్డలు..

దేశమేదైనా అమ్మ మనసు ఒకలానే ప్రతిస్పందిస్తుంది.. తానేమైపోయినా ఫరవాలేదు.. బిడ్డలు మాత్రం చల్లగా ఉండాలని కోరుకుంటుంది.. తన ప్రాణాలను ఫణంగా పెట్టైనా బిడ్డల్ని కాపాడుకోవాలనుకుంటుంది.. చుట్టూ మంటలు వ్యాపిస్తుంటే మరణానికి చేరువవుతున్నామన్న విషయం అర్థమైనా.. కనీసం తన బిడ్డలనైనా రక్షించాలనుకుంది. ఆమె ప్రయత్నం ఫలించి బిడ్డలు ప్రాణాలతో బయటపడ్డారు. తను మాత్రం అగ్నికి ఆహుతి అయ్యింది.

చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తులో హఠాత్తుగా మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు వారిని రక్షించే ప్రయత్నం చేద్దామన్నా అప్పటికే మంటలు ఎగసిపడుతున్నాయి. కిందనున్న వారు నిస్సహాయంగా చూస్తూ నిలబడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. అగ్ని మాపక సిబ్బంది తమ ప్రయత్నం తాము చేస్తూ మంటల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు.


అదే ఫ్లాట్‌లో ఇద్దరు బిడ్డలతో నివసిస్తున్న ఓ తల్లి సహాయం కోసం ఎదురు చూడకుండా తన బిడ్డల్ని కాపాడాలనుకుంది. వెంటనే ఓ దుప్పటి కిందకు వేసింది. అది కింద ఉన్న వారు పట్టుకోగా ఇద్దరు బిడ్డలు అందులో పడేలా పైనుంచి విసిరేసింది. 9 ఏళ్లు, 3ఏళ్లు ఉన్న తన ఇద్దరు పిల్లలు చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. తాను మాత్రం బయటపడలేకపోయింది. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమె స్పృహ కోల్పోయింది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
అయినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూనే మరణించింది. బిడ్డలను కాపాడిన ఆ మాతృమూర్తికి సోషల్ మీడియా జేజేలు పలుకుతోంది.