రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు కుదిరిన ముహూర్తం

rajya-sabha-deputy-chairman-election-to-be-held-on-august-9-venkaiah-naidu

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు ముహూర్తం కుదిరింది. ఈనెల 9న ఉదయం 11 నుంచి ఓటింగ్‌ జరుగుతుంది. ఎనిమిదో తేదీ మధ్యాహ్నంలోపు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. దీంతో గెలుపు కోసం ప్రధాన పార్టీలు స్కెచ్‌లు వేస్తున్నాయి. ప్రతిసారి అధికార పక్షానికే పదవి దక్కుతుంది. ఈసారి సంథింగ్ స్పెషల్‌. ఏ పార్టీకి స్పష్టమైన సంఖ్యా బలం లేదు. దీంతో డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక రసవత్తర రాజకీయ క్రీడకు వేదికగా మారుతోంది.

ఉపసభాపతి ఎన్నికల ఓటింగ్‌లో 243 మంది సభ్యులు పాల్గొంటారు. మేజిక్ ఫిగర్ 122 అవుతుంది. సభలో బీజేపీకి 73 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్న అన్నాడీఎంకే, టీఆరెస్‌ సభ్యులను పరిగణలోకి తీసుకుంటే ఎన్డీఏ బలం 109. కాంగ్రెస్‌ సహా ఇటీవల ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ సభ్యులతో కలిపితే ప్రతిపక్షాల బలం 110. వైసీపీ సహా ఇతర పార్టీలకు చెందిన 20 మంది ఎటూ తేల్చుకోలేదు. దీంతో బీజేపీ నాయకత్వం అలర్టయింది. ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని పావులు కదుపుతున్న NDA, UPAలు… ప్రాంతీయ పార్టీలకు గాలం వేసే పనిలో పడ్డాయి.

డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ప్రాంతీయ పార్టీల హవా కనిపిస్తోంది. ఎన్డీఏకి దూరమైంది కాబట్టి టీడీపీ తటస్థంగానో, ప్రతిపక్షాల వైపో ఉంటుంది. మ్యాజిక్‌ ఫిగర్ అందుకోవాలంటే టీఆర్‌ఎస్‌, బీజేడీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది కమళదళం. ఎన్డీఏ అభ్యర్థిగా మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ తనయుడు నరేశ్‌ గుజ్రాల్‌ను బరిలోకి దింపాలని యోచిస్తోంది. మరోవైపు జేడీయూ నేత హరివంశ్‌ సింగ్‌ పేరుకూడా ప్రచారంలో ఉంది. కాంగ్రెస్ వైపు నుంచి మాత్రం ఎవరి పేరు తెరపైకి రాలేదు. మరో రెండ్రోజుల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.